కుమ్మేస్తున్న రాజుగారి గది2 కలెక్షన్లు.. నాకు పెళ్లి కానుక అంటున్న సమంత
ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున, సమంత అక్కినేని నటించిన రాజుగారి గది2 చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత రిలీజైన సమంత సినిమా ఇదే. అక్కినేని వారి ఇంట అడుగుపెట్టిన వేళా విశేషం ఏమిటో గానీ సమంత, నాగార్జునకు మంచి హిట్ లభించింది. ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తున్న నేపథ్యంలో సమంత తన స్పందన ఇలా వ్యక్తం చేసింది.

నికర కలెక్షన్లు 12 కోట్లు
రాజుగారి గది2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి వారాంతానికి రూ.21 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. నికర కలెక్షన్లు 12 కోట్లుగా నమోదయ్యాయి. ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ పెరుగడం కలెక్షన్లు పెరగడానికి సానుకూలంగా మారింది.

ఏపీ, తెలంగాణలో 9.58 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో రాజుగారి గది2 చిత్రం సుమారు 9.58 కోట్లు కొల్లగొట్టింది. నాగార్జున కెరీర్‌లో ఈ రేంజ్ కలెక్షన్లు రావడం అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నది.

ఏరియాల వారీగా కలెక్షన్లు
రాజుగారి గది2 సినిమా కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో సుమారు 4 కోట్లు, సీడెడ్‌లో 1.3 కోట్లు, వైజాగ్‌లో 1.1 కోట్లు, గుంటూరులో 90 లక్షలు, తూర్పు, పశ్చిమ గోదావరిలో 1.2 కోట్లు, కృష్ణా జిల్లాలో 70 లక్షలు, నెల్లూరులో 30 లక్షలు కలెక్షన్లను ఈ చిత్రం సాధించింది.

నాకిచ్చిన పెళ్లి కానుక
రాజుగారి గది2 చిత్ర విజయంపై సమంత అక్కినేని స్పందిస్తూ.. రాజుగారి గది 2 సినిమా సక్సెస్ తెలుగు ప్రేక్షకులు నాకిచ్చిన పెళ్లి కానుక. ఈ సినిమా క్లైమాక్స్‌లో మామయ్య ఎంతో సహకారం అందించారు. మామయ్యకు చాలా చాలా థాంక్స్ అని అన్నారు.

అందరికీ థ్యాంక్స్
అమృత పాత్రలో నటించేందుకు అవకాశమిచ్చిన దర్శకుడు ఓంకార్, నిర్మాత ప్రసాద్ వీ పొట్లూరికి ధన్యవాదాలు. యూనిట్ సభ్యులందరికీ నా స్పెషల్ థ్యాంక్స్. సినిమాలో బాగా నటించానంటూ సోషల్‌మీడియా ద్వారా చాలామంది నన్ను అభినందిస్తున్నారు. మున్ముందు ఇంతకన్నా గొప్పగా నటించడానికి ప్రయత్నిస్తా అని సమంత చెప్పింది.


Click it and Unblock the Notifications











