500 కోట్ల సంచలనం .. సంక్రాంతికి వస్తున్నాంతో అనిల్ రావిపూడి రేర్ ఫీట్
తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీని హీరోని చేసి హిట్లు కొట్టి ట్రెండ్ సెట్ చేశారు హాస్య బ్రహ్మ జంధ్యాల. ఆ తర్వాత ఆయన వారసుడిగా ఈవీవీ సత్యనారాయణ ఎంట్రీతో అది కొత్తపుంతలు తొక్కింది. ఆయన కాలం చేశాకా శ్రీనువైట్ల ఆ ప్లేస్ తీసుకున్నారు. వరుస హిట్‌లతో ఓ పదేళ్ల పాటు తన హవా చూపించారు శ్రీనువైట్ల. కామెడీ, ఇంటిల్లిపాది చూసే సినిమాలు తగ్గుతున్న దశలో ఎంట్రీ ఇచ్చారు అనిల్ రావిపూడి. తనదైన హాస్యంతో మళ్లీ కామెడీ చిత్రాలకు , కుటుంబ కథా చిత్రాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు అనిల్.
విక్టరీ వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్‌హిట్ కావడంతో ప్రస్తుతం ఆయన పేరు చిత్ర సీమలో మారుమోగుతోంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ వంటి భారీ చిత్రాలు లైన్‌లో ఉన్నప్పటికీ తన సినిమాను హిట్‌గా నిలబెట్టారు అనిల్. ఇక దిల్‌రాజైతే ఆయనను ఆకాశానికెత్తేస్తున్నారు. వరుస ఫ్లాప్స్‌తో ఉన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ను ఒడ్డున పడేశాడని దిల్‌రాజు ఆయన సోదరుడు శిరీశ్‌లు అనిల్‌కు థ్యాంక్స్ చెబుతున్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన అనిల్ రావిపూడి తండ్రి బ్రహ్మయ్య ఆర్టీసీ డ్రైవర్. కుటుంబ ఆర్ధిక పరిస్ధితుల దృష్ట్యా ఎంతో కష్టపడి బీటెక్ పూర్తి చేశారు అనిల్. చిన్నప్పటి నుంచే ఆయనకు సినిమాలపై ఆసక్తి. ప్రముఖ దర్శకుడు పీ. అరుణ్ ప్రసాద్ స్వయంగా అనిల్‌కు బాబాయ్. ఆయన అడుగుజాడల్లో చిత్రసీమలో అడుగుపెట్టిన అనిల్ .. పలువురి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ నేపథ్యంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఆయనకు దర్శకుడిగా అవకాశం కల్పించారు. అదే పటాస్.. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించారు అనిల్.
తొలి చిత్రంతోనే తన సత్తా చాటిన అనిల్ రావిపూడి.. ఆ వెంటనే సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3, సరిలేరు నీకెవ్వరు, భగవంత్ కేసరి వంటి కామెడీ సినిమాలతో నిర్మాతలకు కనక వర్షం కురిపించారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు అనిల్ రావిపూడి. జనవరి 14న విడుదలైన ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే రూ. 132 కోట్ల వసూళ్లు సాధించి సంక్రాంతి హిట్‌గా నిలిచింది. వెంకటేష్ నటన, అనిల్ టేకింగ్‌కు కుటుంబ ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. దీంతో అమలాపురం నుంచి అమెరికా వరకు ఈ సినిమాకు హౌస్‌ఫుల్స్ పడుతున్నాయి.
ఈ సినిమా ఘన విజయం ద్వారా అనిల్ ఓ అరుదైన ఘనతను సాధించారు. ఆయన దర్శకత్వం వహించిన గత నాలుగు చిత్రాలు ( ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3, భగవంత్ కేసరి ) వరుసగా యూఎస్‌లో మిలియన్ డాలర్లతోపాటు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ద్వారా 5వ సారి ఈ ఘనత అందుకున్నారు అనిల్ రావిపూడి వెల్లడించారు. అలాగే విక్టరీ వెంకటేష్‌తో చేసిన మూడు సినిమాలు మూడు సార్లు మిలియన్ డాలర్లను, మూడు సార్లు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వెంకీకి లక్కీ డైరెక్టర్‌గా మారిపోయారు. టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత అంతటి సక్సెస్ రికార్డును సొంతం చేసుకున్న దర్శకుడిగా అనిల్ నిలిచాడని ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


Click it and Unblock the Notifications











