Varanasi Budget: వారణాసి బడ్జెట్ ఎంత? మహేష్ బాబు మూవీ రెండు పార్టులా?
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో 29వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు.
ఈ సినిమాకు కథ, మాటల సహకారాన్ని దేవకట్టా అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా తమ్మిరాజు, ఫైట్స్ కింగ్ సాల్మన్, సినిమాటోగ్రఫిని ఎస్ గోపాల్ రెడ్డి, పీఎస్ వినోద్ అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ తర్వాత అనేక రకాల వివాదాల్లో నలుగుతున్నది. అయితే చిత్ర యూనిట్ మాత్రం సైలెంట్‌గా తన పని తాను చేసుకొంటూ పోతున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఒక పార్టా? రెండు పార్టులా? అనే చర్చ మొదలైంది. వాటికి సమాధానాలు ఏమిటనే వివరాల్లోకి వెళితే..

వారణాసి సినిమాకు కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన నిర్మాణ రంగంలోకి వచ్చారు. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో టాప్ యాక్టర్లు, టాప్ టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. దాంతో పాటు గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా భారీగా జరుగుతున్నది. దాంతో ఈ సినిమాను గ్లోబల్ మూవీగా మార్చేస్తున్నారు.
ఈ సినిమా అట్టహాసంగా నిర్మించే క్రమంలో ఖర్చుకు వెనుకాడటం లేదనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తున్నది. ఈ సినిమాను అన్ని ఖర్చులతో కలిపి మొత్తంగా 135 మిలియన్ డాలర్లు అంటే.. భారతీయ కరెన్సీలో 1200 కోట్ల రూపాయలుగా పేర్కొంటున్నారు. భారతీయ సినిమా రంగంలో అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందే సినిమాల్లో ఈ చిత్రం ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాను ఒక పార్టుగా తెరకెక్కిస్తున్నారా? రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారా? అనే ప్రశ్నలకు రాజమౌళి అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ సినిమాను ఓకే పార్టుగా నిర్మించే యోచనలో ఉన్నారు. మున్ముందు పరిస్థితులు డిమాండ్ చేస్తే తప్పా.. ఈ నిర్ణయంలో మార్పు ఉండదనే మాట వినిపిస్తున్నది. ఈ సినిమాను సుమారుగా 3 గంటల 25 నిమిషాల రన్‌టైమ్‌తో ఒకే పార్టుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని తెలిసింది.
ఇదిలా ఉండగా, వారణాసి టైటిల్ గ్లింప్స్ తర్వాత హిందుత్వ వాదులంతా రాజమౌళిపై దారుణంగా విరుచుకుపడుతున్నారు. హానుమాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై బీజేపీ నేతలు కూడా వార్నింగ్ ఇవ్వడం వివాదంగా మారుతున్నది. వీటిపై రాజమౌళి ఎలా సమాధానం ఇస్తాడో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











