ఆది ‘సుకుమారుడు’సీడెడ్ రైట్స్ ఎంతకంటే..
హైదరాబాద్: ఆది హీరోగా, పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ జి. దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కె. వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం 'సుకుమారుడు' . ఈ చిత్రం బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ట్రేడ్ ద్వారా అందిన సమాచారం ప్రకారం... ఈ చిత్రం సీడెడ్ రైట్స్ ని ప్రదీప్ పిక్చర్స్ వారు 1.01 కోట్లకు సొంతం చేసుకుున్నారు. ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్స్ లో పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి.
ఈ చిత్రం స్టోరీ లైన్ ప్రకారం...వయసు మళ్లిన మనసుకి సాంత్వన కలిగించేవి అనుబంధాలూ, ఆప్యాయతలే. బతుకు బడిలో పాఠాలుగా నేర్చుకొన్న అనుభవాలను తమ వారసులకు చెప్పాలని తాపత్రయపడతారు. తప్పటడుగులు వేయకుండా... జాగ్రత్తపడతారు. వీళ్లూ అదే చేశారు. అమెరికా నుంచి వచ్చే తమ ముద్దుల మనవడికి తెలుగు పద్ధతులు నేర్పించాలనుకొన్నారు. మన సంప్రదాయాలు గుర్తు చేద్దామనుకొన్నారు. ఆ మనవడు రానే వచ్చాడు.
మరి తాతయ్య, నాన్నమ్మల కోరిక ఫలించిందా? మనవడికి మన సంప్రదాయం నచ్చిందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే. అమెరికా నుంచి వచ్చిన మనవణ్ని చూసిన ఆ పెద్దాయనకు తన టీనేజ్ గుర్తుకొచ్చింది. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగిన ఆ అబ్బాయికి తెలుగుదనాన్ని ఎలా రుచి చూపించారు? ఇక్కడి పద్ధతులకు ఆ అల్లరి కుర్రాడు అలవాటుపడ్డాడో లేదా అనే కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందుతోంది.
నిర్మాత మాట్లాడుతూ ''ఉగాది పచ్చడిలాంటి సినిమా ఇది. అన్ని రుచులూ ఉంటాయి. కృష్ణ, శారదలు పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి''అని చెప్పారు. ఆది, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. కృష్ణ, శారద కీలక పాత్రలు పోషించారు. నీలం ఉపాధ్యాయ, సూపర్‌స్టార్ కృష్ణ, శారద, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, రావురమేష్, శ్రీనివాస్ అవసరాల, అజయ్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: సాయిశ్రీరామ్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, మాటలు: చంద్రశేఖర్ గుండిమెడ, నిర్మాత: కె.వేణుగోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్ జి.


Click it and Unblock the Notifications











