Vettaiyan pre Release business : రజనీ రికార్డ్ బిజినెస్.. వేట్టయన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అన్ని కోట్లా?
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రజనీకాంత్ అభిమానులను కాలర్ ఎగరేసేలా చేసింది. తనలో ఏమాత్రం వాడి తగ్గలేదని తలైవా నిరూపించారు. ఈ సినిమా తర్వాత సూపర్‌స్టార్ నటించిన చిత్రం వేట్టయన్ ది హంటర్ . ఇది రజనీకాంత్ కెరీర్‌లో 170వ చిత్రం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో దసరా కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య విడుదలవుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేసింది, ఎన్ని కోట్లు వస్తే వేట్టయన్ లాభాల్లోకి వస్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ వివరాల్లోకి వెళితే..
జై భీమ్ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన వేట్టయన్‌లో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషించారు. దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత రజనీతో అమితాబ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు వేట్టయన్‌పై హైప్‌ను భారీగా పెంచేశాయి. ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు ఫహద్ ఫాజిల్, మంజు వారియర్, రితికా సింగ్, తుషారా విజయన్, రానా దగ్గుబాటి కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చారు.

రజనీ మూవీ రిలీజ్ అవుతుందంటే అభిమానులకు పండగ . ఆయన సినిమా కోసం గతంలో పలు ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. తాజాగా వేట్టయన్ విషయంలో మరోసారి తమిళనాడులో కొన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాయి. ఈ మేరకు కొన్ని కంపెనీల ఉద్యోగులు సెలవుకు సంబంధించిన ఉత్తర్వుల కాపీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక వేట్టయన్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. ప్రీ సేల్స్‌లో రజనీ దుమ్మురేపుతున్నాడు. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ కోసం ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి ఓవర్సీస్‌లో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించాడు వెట్టయాన్.
భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న వేట్టయాన్‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను రెడ్ జెయింట్ సంస్థ దక్కించుకోగా.. ఓవర్సీస్‌లో లైకా ప్రొడక్షన్స్ ఓన్‌గా రిలీజ్ చేస్తోంది. కేరళలో శ్రీ గోకులం మూవీస్ వెట్టయాన్ థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నాయి. తెలుగు విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో వెట్టయాన్ థియేట్రికల్ రైట్స్ రూ.17 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక్కడ రజనీ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవాలంటే దాదాపు రూ.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంది.

తమిళనాడులో వేట్టయన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.73 కోట్లకు అమ్ముడవగా.. తెలుగులో రూ.17 కోట్లు, కన్నడ, మలయాళం, హిందీ రైట్స్ రూ.25 కోట్లతో పాటు ఓవర్సీస్‌లో రూ.45 కోట్ల మేర జరిగింది. మొత్తంగా వరల్డ్ వైడ్‌లో వేట్టయన్ రూ.160 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.160 కోట్ల షేర్ , రూ.320 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాలి. రజనీ సినిమాకి ఏమాత్రం టాక్ బాగున్నా.. ఈ టార్గెట్ వేట్టయన్ ఊదిపారేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Click it and Unblock the Notifications











