Suriya ET 1st week Collections: రాధే శ్యామ్‌కే దెబ్బ కొట్టిన ఈటీ.. తెలుగులో ఇంకెంత వస్తే హిట్ అంటే!
పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. దక్షిణాది మొత్తం ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకున్నాడు సూర్య. సుదీర్ఘ కాలంగా విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన చిత్రాలను చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతున్నాడు. దీంతో స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో 'ఆకాశమే హద్దురా', 'జై భీమ్' అనే చిత్రాలను చేసినా.. అవి ఓటీటీలో విడుదల అయ్యాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి సూర్య 'ఈటీ' అనే సినిమాతో థియేటర్లలో సందడి చేయడానికి వచ్చాడు. గత వారమే విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకోవడంతో కలెక్షన్లను అంతగా రాబట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో తెలుగులో ఇది వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

ఎవరికీ తలవంచను అంటూనే
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన తాజా చిత్రమే ‘ఈటీ - ఎవరికీ తలవంచకు'. పాండిరాజ్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించాడు. వినయ్ రాయ్, సత్యరాజ్, సూరి తదితరులు కీలక పాత్రలు చేశారు.

ఈటీ తెలుగు బిజినెస్ వివరాలు
చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉంది. దీంతో ‘ఈటీ'కి భారీ బిజినెస్ జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ, రాధే శ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమా ఒకరోజు ముందే విడుదల కాబోతుండడంతో.. దీని తెలుగు హక్కులను కేవలం రూ. 3.50 కోట్లకే కొనుగోలు చేశారు. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేశారు.

థియేటర్లు తగ్గించడంతో డౌన్
సూర్య నటించిన ‘ఈటీ' మూవీకి తెలుగులో కూడా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు ఈ చిత్రం పెద్దగా రాబట్టలేదు. అయితే, మాస్ సినిమా కావడంతో ప్రేక్షకులు వస్తారని అంతా అనుకున్నారు. అయితే, రాధే శ్యామ్ విడుదల కారణంగా ఈ సినిమా థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. ఈ ప్రభావం బాక్సాఫీస్‌పై పడింది. దీంతో దీనికి చాలా తక్కువే కలెక్షన్లు వస్తున్నాయి.

వీక్ డేస్‌లో బాగా పెరిగిన కలెక్షన్లు
మొదటి నాలుగు రోజుల్లో ‘ఈటీకి' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలెక్షన్లు చాలా తక్కువగానే వచ్చాయి. అయితే, వీక్ డేస్‌లో మాత్రం ఇది అనూహ్యంగా పుంజుకుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అందుకే సోమ, మంగళ, బుధవారాల్లో సూర్య సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 1 కోటికి పైగానే షేర్ వసూలు అయ్యాయి. అంటే రాధే శ్యామ్‌ను ఇది దెబ్బకొడుతోంది.

వారంలో ఎంత వసూలు చేసింది
వారం రోజులకు ‘ఈటీ' మూవీకి ఏపీ తెలంగాణలో మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 87 లక్షలు, సీడెడ్‌లో రూ. 46 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 43 లక్షలు, ఈస్ట్‌లో రూ. 26 లక్షలు, వెస్ట్‌లో రూ. 18 లక్షలు, గుంటూరులో రూ. 23 లక్షలు, కృష్ణాలో రూ. 21 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలిపి.. రూ. 2.78 కోట్లు షేర్, రూ. 5.25 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది.
Recommended Video


బ్రేక్ ఈవెన్ ఇలా.. ఎంత రావాలి?
తెలుగులో భారీ అంచనాలను ఏర్పరచుకున్న ‘ఈటీ' మూవీకి రెండు రాష్ట్రాల్లో రూ. 3.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మొదటి వారం రోజుల్లో రూ. 2.78 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 1.21 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.


Click it and Unblock the Notifications











