‘టాక్సీవాలా’ బాక్సాఫీస్ కలెక్షన్ల పరిస్థితి ఏలా ఉంది?
విజయ్ దేవరకొండ హీరోగా కొత్త దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ రూపొందించిన 'టాక్సీవాలా' బాక్సాఫీసు సందడి ఆశా జనకమైన వసూళ్లతో మొదలైంది. సినిమా విడుదల ముందే లీక్ అవ్వడంతో పరిస్థితి ఎలా ఉంటుందో? అని చిత్ర బృందంతో పాటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందారు. అయితే మొదటి షో పడ్డ తర్వాత పాజిటివ్ టాక్ రావడం, రివ్యూలు కూడా బావుండటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.
విజయ్ నటించిన 'గీత గోవిందం' యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధించింది. అయితే ఆ తర్వాత విడుదలైన 'నోటా' అంచనాలను అందుకోలేదు. 'టాక్సీవాలా'తో విజయ్ మళ్లీ పుంజుకుంటాడని భావించారు. దాన్ని నిజం చేస్తూ సినిమా యూఎస్ఏ ప్రీమియర్ షోల ద్వారా సంతృప్తికర వసూళ్లు సాధించింది.

యూఎస్ఏలో 120 స్క్రీన్లలో
జిఏ2 పిక్చర్స్, యూవి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని యూఎస్ఏలో 120 స్క్రీన్లలో విడుదల చేశారు. విజయ్ గత చిత్రం ‘నోటా' ప్లాప్ అయినప్పటికీ విజయ్ గత చిత్రాలు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం మంచి విజయం అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రౌడీ స్టార్ సినిమాలపై ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

ప్రీమియర్ షో వసూళ్లు ఎంత?
టాక్సీవాలా చిత్రం 98 లొకేషన్ల నుంచి $115,944 వసూలు చేసింది. దాదాపు 60 శాతం మేర ఆక్సుపెన్సీ సాధించింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి నేపథ్యంలో వీకెండ్ కలెక్షన్స్ పెరుగుతాయని ఆశిస్తున్నారు. విజయ్ గత చిత్రం గీత గోవిందం ప్రీమియర్ షోల ద్వారా $403,442 వసూలు చేయగా, నోటా $187,537 రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో...
పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇంకా అఫీషియ్ కలెక్షన్స్ వివరాలు బయటకు రాలేదు. అయితే తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 4 కోట్లకుపై షేర్ రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.

ఈవారం ‘టాక్సీవాలా' హవా
‘గీత గోవిందం' స్థాయికి వెళ్లక పోయినా.... ‘నోటా' కంటే ‘టాక్సీవాలా' మంచి వసూళ్లు సాధిస్తుందని... ఆల్రెడీ స్ప్రెడ్ అయిన పాజిటివ్ మౌత్ టాక్ బట్టి తెలుస్తోంది. మరో వైపు ‘అమర్ అక్బర్ ఆంటోనీ' నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో.... ఈ వారం ‘టాక్సీవాలా' హవా కొనసాగడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











