కన్నడ చిత్రాలకు స్టాలిన్ దెబ్బ
కన్నడ చిత్ర నిర్మాతల యూనియన్ శుక్రవారంనాడు ఒక ఎమర్జెన్సీ సమావేశం ఏర్పాటు చేసి.. అక్టోబర్ 2వ తేదీ నుంచి కన్నడ చిత్రాల ముహూర్తాలను నిలిపివేయాలని తీవ్ర నిర్ణయం తీసుకుంది. కన్నడ చిత్ర సీమ ప్రస్తుతం చాలా యిబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకూ కొత్త చిత్రాలు ప్రారంభించరాదని నిర్మాతల యూనియన్ నిర్ణయించింది.
కర్నాటకలో కన్నడ చిత్రాల కంటే తెలుగు చిత్రాలకే ఎక్కువ ఆదరణ ఉండటంతో సహజంగానే కన్నడ నిర్మాతల కడుపు మండుతోంది. రూల్ ప్రకారం కన్నడ రాష్ట్రంలో ఇతర భాషా చిత్రాలు కేవలం 6 ప్రింట్ల కంటే ఎక్కువ ప్రింట్స్‌తో విడుదల కారాదు. కానీ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్, నాగార్జున బాస్ చిత్రాలు కర్నాటక అంతటా 30కి పైగా ప్రింట్లతో విడుదలై విపరీతమైన కలెక్షన్లు సాధిస్తున్నాయి. కన్నడ హీరోల కంటే కర్నాటకలో మెగాస్టార్ చిరంజీవికీ, నాగార్జునకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. అత్యధికంగా ప్రింట్లతో విడుదలవుతున్న తెలుగు చిత్రాల వల్ల కన్నడ చిత్రాలు కలెక్షన్లు లేక విలవిలలాడుతున్నాయి.
గత తొమ్మిది నెలల్లో కర్నాటక రాష్ట్రంలో ఇతర భాషా చిత్రాలు 50 వరకూ విడుదలయ్యాయి. దీని కారణంగా కన్నడ చిత్ర పరిశ్రమ సుమారు రూ.60 కోట్ల రూపాయలను నష్టపోయింది. ఇక దీనిని ఎంతమాత్రం సహించరాదని, ప్రభుత్వం కదలిరావాలంటే.. కఠిన నిర్ణయాలు తప్పవని కన్నడ నిర్మాతల యూనియన్ సంకల్పించింది. యూనియన్ నిర్ణయానికి ప్రముఖ నిర్మాతలైన పార్వతమ్మ రాజ్‌కుమార్, రాక్‌లైన్ వెంకటేశ్ తదితరులు మద్దతు తెలిపారు.
ఇదిలా ఉండగా, చెన్నైలో కూడా స్టాలిన్ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. మొదట మూడు థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం తొలి వారంలోనే 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. చెన్నైలో ఇంత భారీ కలెక్షన్లు సాధించిన తొలి తెలుగు చిత్రం స్టాలిన్ అయింది. గతంలో మహేశ్‌బాబు - పోకిరి - కి ఈ రికార్డు ఉండేది.


Click it and Unblock the Notifications