హీరో ఫీజు మూడున్నర కోట్లే: మండలి
హైదరాబాద్: నిర్మాతల మండలి సమావేశమై సినిమా నిర్మాణానికి అవుతున్న ఖర్చును తగ్గించాలని నిర్ణయించింది. హీరోల రెమ్యూనరేషన్‌ను ఎట్టి పరిస్థితులలోనూ మూడున్నర కోట్లు మించరాదని నిర్మాతల మండలి నిర్ణయించింది.
పేరున్న కథానాయకులకు సుమారు పది పన్నెండు కోట్లు రెమ్యూనరేషన్ గా ఇస్తున్న సమయంలో చిత్ర నిర్మాణం మొత్తం విపరీతంగా పెరిగిపోతున్నదని కొందరు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. ఇంతా చేస్తే సినిమా ప్రజలలోకి వెళ్తుందా, లాభాలు లేకపోతే పోయింది, కనీసం పెట్టుబడి అయినా వస్తుందా అంటే అదీ అనుమానంగానే మారిపోయిందని పెక్కుమంది నిర్మాతలు ఈ సమావేశంలో వాపోయినట్టు తెలుస్తున్నది. ముఖ్యమైన నిర్మాతలు అందరూ పాల్గొన్న ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్మాతల మండలి తీర్మానించింది. కేరళ వంటి రాష్ట్రాలలో ఎంత పెద్ద హీరో అయినా మొత్తం సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చే మూడున్నర కోట్లకు మించనప్పుడు తెలుగు సినిమా రంగానికి ఈ ఇబ్బంది ఇంకా ఎంతకాలం అని కొందరు ఆవేదన చెందినట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











