Thammudu Box Office Day 1: తమ్ముడు ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్.. నితిన్ మూవీకి ఓపెనింగ్స్ ఎన్ని కోట్లంటే?
వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వస్తిక నటించిన చిత్రం తమ్ముడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. సీనియర్ నటి లయ, సౌరబ్ సచ్‌దేవ, హరితేజ, చమ్మక్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చగా.. కేవీ గుహన్, సమీర్ రెడ్డి, సేతు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి? తమ్ముడు సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
తమ్ముడు బడ్జెట్ ఎంత?
నిర్మాణ పరంగా ఎక్కడా తగ్గకుండా తమ్ముడు సినిమాను నిర్మించారు నిర్మాత దిల్‌రాజు. అటవీ ప్రాంతాల్లో, సహజమైన లోకేషన్‌లలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలు కలిపి తమ్ముడు చిత్రానికి 75 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం అయ్యింది.

తమ్ముడు బిజినెస్& బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత?
నితిన్ గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా తమ్ముడు సినిమాకు థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. నైజాంలో 8.5 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలు, ఏపీలోని ఇతర జిల్లాల హక్కులు 8.5 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. మొత్తంగా ఆంధ్రా, నైజాంలలో తమ్ముడు సినిమాకు 20 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే.. కర్ణాటకలో 1.5 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియా హక్కులు 50 లక్షలు, ఓవర్సీస్ రైట్స్ 2 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. మొత్తంగా తమ్ముడు చిత్రం ప్రపంచవ్యాప్తంగా 24 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసింది. నితిన్ సినిమా లాభాల్లోకి రావాలంటే దాదాపు రూ.25 కోట్ల షేర్, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. తెలుగు రాష్ట్రాల్లో 400 థియేటర్లలో, ప్రపంచవ్యాప్తంగా 600 స్క్రీన్లలో తమ్ముడు సినిమాను గ్రాండ్‌గా విడుదల చేశారు.
తమ్ముడు తొలిరోజు వసూళ్లు ఎంతంటే?
నితిన్ సినిమాకు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు 21.33 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. హైదరాబాద్‌లో 381 షోలు, బెంగళూరులో 262 షోలు, విజయవాడలో 82, విశాఖలో 114 షోలు ప్రదర్శితమయ్యాయి. తమ్ముడు సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో చిత్ర యూనిట్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది. సినిమా మీద అంత బజ్ లేనప్పటికీ మౌత్ టాక్‌ను నితిన్ అండ్ కో నమ్ముకుంది. రెండ్రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసినప్పటికీ పెద్దగా బుకింగ్స్ జరగలేదు.
నితిన్ గత చిత్రాలు, ఆయన రీసెంట్ ఫాం ప్రభావం కూడా ఖచ్చితంగా తమ్ముడుపై పడుతోంది. సాయంత్రం 5 గంటల వరకు జరిగిన బుకింగ్స్‌ను బట్టి చూస్తే.. నితిన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయల కలెక్షన్స్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో రూ.50 లక్షలు రాబట్టవచ్చని చెబుతున్నారు. ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. దిల్‌రాజు సినిమాలకు నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాలలో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో ఓవర్సీస్‌లో తమ్ముడు మూవీ కోటి రూపాయల వరకు కలెక్ట్ చేయొచ్చని భావిస్తున్నారు. మొత్తంగా నితిన్ మూవీ ఫస్ట్ డే 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టవచ్చని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











