వంశీ 'తను మొన్నే వెళ్లిపోయింది' ఆడియో రైట్స్ ?
హైదరాబాద్ : దర్శకుడు వంశీ సినిమాలంటేనే విభిన్నతకు మారు పేరుగా ఉంటాయి. దాంతో ఆయన చిత్రం వస్తోందంటే ఎదురుచూసే వాళ్లు చాలా మంది ఉంటారు. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తను మొన్నే వెళ్లిపోయింది'. అజ్మల్, నిఖితా నారాయణ్ జంటగా నటించారు. పూర్ణనాయుడు నిర్మాత. షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం ఆడియో రైట్స్ ని లహరి ఆడియో కంపెనీ వారు ఆరు లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. త్వరలో ఈ చిత్రం విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
చిత్రం కాన్సెప్టు ఏమిటంటే... ఎదుటివారికి సాయపడటంలోనే తన ఆనందాన్ని వెదుక్కొనే యువకుడు సుశీల్. చదువులు పూర్తి చేసుకొన్నాడు. అందుకే ఇంట్లోవాళ్లు ఓ పెళ్లి సంబంధం చూశారు. సిగ్గులు ఒలకబోస్తూ పెళ్లింట్లో అందంగా ముస్తాబై కూర్చుంది సత్య. కాబోయే దంపతులు ఇద్దరూ ఒకర్నొకరు చూసుకొన్నారు. మనసు విప్పి మాట్లాడుకొన్నారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి ఓ అమ్మాయిని వెదికేందుకు ప్రయాణం కట్టారు. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఈ జంటకీ, ఆ అమ్మాయికీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

వంశీ మాట్లాడుతూ ''ఒక యువతి కోసం సుశీల్, సత్య అనే పెళ్లి కుదిరిన జంట సాగించే అన్వేషణ ఈ కథ. అసలు ఆమె కోసం ఆ ఇద్దరూ వెదకడం... ఆ క్రమంలో కథలో వచ్చే మలుపులు ప్రేక్షకుల్ని ఉత్కంఠపరుస్తాయి. వినోదాత్మకంగా ఉంటుంది. ఈ సినిమా కోసం సిద్ధం చేసిన ప్రచార పత్రికలకు సామాజిక వెబ్‌సైట్ల మంచి స్పందన వచ్చింది'' అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎమ్వీ రఘు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: వేమూరి సత్యనారాయణ, ఎడిటింగ్: బస్వాపైడిరెడ్డి, సంగీతం: చక్రి.


Click it and Unblock the Notifications











