The Devil Box Office: జైలులో స్టార్ హీరో... ప్రీ సేల్స్‌లో ది డెవిల్ సంచలనం, దర్శన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
తన వీరాభిమాని రేణుకా స్వామిని అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ తూగుదీప అరెస్ట్ కావడంతో శాండల్‌వుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఆ తర్వాత ఆయన బెయిల్‌పై బయటకు వచ్చి తన సినిమాలు తాను చేసుకుంటూ ఉండటంతో సుప్రీంకోర్టు జోక్యంతో దర్శన్ మరోసారి జైలులో అడుగుపెట్టాల్సి వచ్చింది. వివాదాలు, హత్య కేసుతో ఈ అగ్రనటుడు తన కెరీర్ చేజేతులా నాశనం చేసుకున్నాడు. దర్శన్ జైల్లోకి వెళ్లడంతో ఆయన నటిస్తోన్న సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.
డిసెంబర్ 11న ది డెవిల్
జైలుకు వెళ్లినప్పటికీ దర్శన్‌లో ఎలాంటి మార్పు రాలేదు. తోటి ఖైదీలతో గొడవ, తనకు సౌకర్యాలు కావాలని లేదంటే విషమిచ్చి చంపేయాలంటూ దర్శన్ ఓవరాక్షన్ నిత్యం వార్తల్లో వస్తూనే ఉన్నాయి. అయితే దర్శన్ నటించిన లేటెస్ట్ మూవీ ది డెవిల్ విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 11న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దర్శన్ జైలులోకి వెళ్లిన తర్వాత విడుదల అవుతున్న సినిమా కావడంతో ది డెవిల్‌పై చిత్ర సీమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. నేపథ్యంలో ది డెవిల్ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్‌లో ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాలు పరిశీలిస్తే..

ది డెవిల్ తారాగణం
వైష్ణో స్టూడియోస్, జై మాతా కంబైన్స బ్యానర్‌లపై ప్రకాష్, జే జయమ్మలు సంయుక్తంగా ది డెవిల్ సినిమాను నిర్మించగా ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దర్శన్ సరసన రచన రాయ్ హీరోయిన్‌గా నటించారు. మహేశ్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్, షర్మిలా మండ్రే, రోజర్ నారాయణ్, శోభరాజ్, శ్రీనివాస్ ప్రభు, తులసి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కాంతార వంటి బ్లాక్ బస్టర్ మూవీకి సంగీతం అందించిన అజనీశ్ లోకనాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. సుధాకర్ ఎస్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. రెండేళ్ల క్రితమే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లగా గతేడాది రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ జైలుకు వెళ్లడంతో ది డెవిల్ షూటింగ్ ఆలస్యమైంది.
ది డెవిల్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలు కలిపి ఈ సినిమాకు 65 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా శాండల్‌వుడ్ వర్గాలు తెలిపాయి. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని అందమైన లోకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. భారీ అంచనాల నేపథ్యంలో ది డెవిల్ నిర్మాణం విషయంలో నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. ఈ సినిమాకు కళ్లు చెదిరే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే అది ఎంత అనేది మాత్రం తెలియరాలేదు.
అడ్వాన్స్ బుకింగ్‌లో ది డెవిల్ రికార్డులు
ఇక భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ది డెవిల్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్‌లో దుమ్మురేపుతోంది. ఈ వీకెండ్ వరకు కర్ణాటకలోని అన్ని థియేటర్‌లలో దాదాపు 80 శాతం మేర బుకింగ్స్ జరిగినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్‌లో ది డెవిల్‌కు ఇప్పటి వరకు కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలోనే 4 కోట్ల రూపాయలు వసూలైట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కర్ణాటకలోని ప్రధాన నగరాలు బెంగళూరు, మైసూరు, హుబ్లీ, మంగళూరు, బళ్లారి, బెళగావి, దావణగెరె, హాసన్, కాలబురగి, షిమోగా తదితర ప్రాంతాల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బుక్ మై షో యాప్‌లోనూ ది డెవిల్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మైసూర్‌లోని టాప్ మల్టీప్లెక్స్‌లలో అడ్వాన్స్ బుకింగ్ కింద ఏకంగా 50 లక్షల రూపాయలు వసూలైనట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఓవరాల్‌గా అడ్వాన్స్ బుకింగ్‌లో ది డెవిల్ మూవీకి 7 కోట్ల రూపాయలకు పైగా రావొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే తొలి రోజు దర్శన్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్‌లో ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు


Click it and Unblock the Notifications











