The Kerala Story 2 Box Office: పేలవంగా ది కేరళ స్టోరి 2 కలెక్షన్లు.. బాక్సాఫీస్ వసూళ్లు ఎన్ని కోట్లంటే?
అత్యంత వివాదాస్పద అంశాల మధ్య ది కేరళ స్టోరి 2 సినిమా విడుదలకు సిద్దమైంది. కేరళ ప్రభుత్వ అభ్యంతరాలు, కోర్టు కేసులు, వాదనల మధ్య ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. అయితే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్ షా తన సన్‌షైన్ బ్యానర్‌పై నిర్మించారు. కేరళ, ఇతర ప్రాంతాల్లో జరిగిన వాస్తవ సంఘటనలు, హిందూ అమ్మాయిలను బలవంతంగా మతమార్పడి చేసి సిరియాకు తరలించే కుట్రల నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు ఆషిన్ ఏ షా, రవిచంద్ నల్లప్ప సహ నిర్మాతలుగా వ్యవహరించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా అత్యంత వివాదాస్పద చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వరయ ఓజా కీలక పాత్రలు పోషించారు. విపుల్ అమృత్‌లాల్ షా కథ అందించిన ఈ చిత్రానికి మన్నన్ షా మ్యూజిక్ అందించారు. ఎడిటర్‌గా సంజయ్ శర్మ, అభిజిత్ చౌదరీ సినిమాటోగ్రఫి, సౌండ్ డిజైనర్‌గా మానస్ చౌదరీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా జుహీ తల్మాకీ వ్యవహరించారు. వివాదాస్పద అంశాలు, కోర్టు తీర్పు మధ్య ఫిబ్రవరి 27వ తేదీన రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

హిందూ అమ్మాయిల మత మార్పిడి అంశంపై రూపొందిన ఈ సినిమాను మీడియం రేంజ్ బడ్జెట్‌లో పూర్తి చేశారు. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులన్నీ కలిపి ఈ సినిమాను సుమారుగా 30 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 30 కోట్లుగా వాల్యూ కట్టారు. దాంత ఈ సినిమా 30 కోట్లు షేర్, 60 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధిస్తే హిట్ జాబితాలో చేరుతుంది.
ఇక ఈ సినిమా చుట్టూ అనేక వివాదాలు చుట్టుముట్టాయి. కేరళ స్టోరి 2 సినిమా మత సామరస్యాన్ని దెబ్బ తీస్తుంది. మత ఘర్షణకు కారణం కావొచ్చు అనే అంశాలపై దాఖలైన పిటిషన్ కారణంగా ఈ సినిమా రిలీజ్‌ను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దాంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అనేది డౌట్‌గా మారింది. కానీ ఫిబ్రవరి 27న ఈ సినిమా రిలీజ్‌కు సానుకూలంగా కోర్టు తీర్పు ఇవ్వడంతో సాయంత్రం నుంచి ప్రదర్శనలు మొదలయ్యాయి. కోర్టు తీర్పు అంశం ఈ సినిమా కలెక్షన్లపై భారీ దెబ్బ తీసింది.
ది కేరళ స్టోరీ 2 వివిధ అంశాల ప్రభావంతో పేలవంగా కలెక్షన్ల జర్నీని మొదలుపెట్టింది. ఈ సినిమా తొలి రోజు 75 లక్షల నికర వసూళ్లను దేశవ్యాప్తంగా సాధించింది. రెండో రోజు ఈ సినిమా 5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండు రోజుల్లో సుమారుగా 6 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ది కేరళ స్టోరి 1 సినిమా విషయానికి వస్తే.. ఆ సమయంలో తొలి రోజు 8 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. రెండో రోజు పుంజుకొని 11 కోట్ల రూపాయలు రాబట్టింది. ఆ సినిమాతో పోల్చుకొంటే ది కేరళ స్టోరి 2 బాక్సాఫీస్ వద్ద అంతగా ప్రేక్షకులను ప్రభావం చూపలేకపోతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











