The Raja Saab Day 1 AP-TG collections: ఏపీ, నైజాంలో రాజాసాబ్ కలెక్షన్లు.. ప్రభాస్ మూవీకి ఎన్ని కోట్లంటే?
The RajaSaab Collections: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన భారీ బడ్జెట్ మూవీ 'ది రాజా సాబ్' పై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హారర్-ఫాంటసీ-కామెడీ జానర్‌లో యంగ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల, ఇషాన్ సక్సేనా సంయుక్తంగా నిర్మించారు. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాగా, జనవరి 8న ప్రీమియర్ షోలతోనే ఈ సినిమా బాక్సాఫీస్ రేస్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తొలి రోజు కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయి? ఈ వివరాల్లోకి వెళితే...
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌లు ప్రభాస్ సరసన హీరోయిన్లుగా నటించారు. బొమన్ ఇరానీ, జరీనా వాహబ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, యోగి బాబు, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీని కార్తీక్ పళని నిర్వహించగా, ఎడిటింగ్ బాధ్యతలను కోటగిరి వెంకటేశ్వరరావు చేపట్టారు. సంగీతాన్ని తమన్ అందించగా, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

భారీ బడ్జెట్... భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు, పబ్లిసిటీ వ్యయాలు కలుపుకొని 'ది రాజాసాబ్' సినిమా బడ్జెట్ సుమారు రూ.400 కోట్లకు పైగాగా అంచనా వేయబడుతోంది. థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే... ఆంధ్రా-నైజాం రూ.120 కోట్లు, హిందీ రూ.30 కోట్లు, తమిళం రూ.8 కోట్లు, కర్ణాటక రూ.15 కోట్లు, కేరళ రూ.4 కోట్లు మేర డీల్స్ జరిగాయి. ఇవన్నీ కాకుండా ఓవర్సీస్ హక్కులు సుమారు రూ.80 కోట్లకు విక్రయమయ్యాయి. మొత్తంగా సినిమా ఓవరాల్ బిజినెస్ విలువ రూ.250 కోట్లకు పైగా ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన థియేటర్లలో పూర్తి లాభాల్లోకి రావాలంటే సినిమా కనీసం రూ.500 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని అంచనా.
ఓవర్సీస్‌లో మరోసారి ప్రభాస్ స్టామినా
ఓవర్సీస్ మార్కెట్‌లో 'ది రాజాసాబ్'ను ప్రతంగిరా మూవీస్ విడుదల చేసింది. ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం, ఓవర్సీస్ మొత్తం లాభాల్లోకి రావాలంటే కనీసం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.90 కోట్లు) వసూలు చేయాలి. నార్త్ అమెరికాలో మాత్రమే బ్రేక్ ఈవెన్ కావాలంటే 7.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.68 కోట్లు) అవసరం అవుతాయని సమాచారం. అయితే, ఈ సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్‌లో సంచలనం సృష్టించింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 'ది రాజాసాబ్' మిలియన్ డాలర్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా ప్రీ సేల్స్‌లోనే మిలియన్ డాలర్ మార్క్‌ను దాటడం ప్రభాస్‌కు ఇది మూడోసారి కావడం విశేషం. గతంలో కల్కి 2898 ఏడీ, సలార్ పార్ట్ 1 కూడా విడుదలకు ముందే ఓవర్సీస్‌లో ఈ ఘనత సాధించాయి.
ది రాజాసాబ్ కలెక్షన్స్
ట్రేడ్ సర్కిల్స్ సమాచారం ప్రకారం, 'ది రాజాసాబ్' సినిమా భారత్‌లో తొలి రోజే రూ.65 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో ప్రధాన వాటా తెలుగు రాష్ట్రాలదే కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిపి రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం ద్వారా ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ప్రీమియర్ షోల ద్వారానే రూ.10 కోట్లకు మించి ఆదాయం రావడం ఈ సినిమాకు ఉన్న అడ్వాన్స్ హైప్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ట్రేడ్ ట్రాకర్లు, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చూస్తే, తెలుగు రాష్ట్రాల్లో డే 1 గ్రాస్ కలెక్షన్లు రూ.56-60 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా. నెట్ కలెక్షన్లు రూ.45-47.4 కోట్ల వరకు నమోదైనట్లు తెలుస్తోంది.
ఏరియా వారీగా చూస్తే, నిజాంలో కూడా ప్రభాస్ సత్తా చాటారు. ప్రీమియర్ షోలతో సహా రూ.22 కోట్ల గ్రాస్ వసూలు కాగా, హైదరాబాద్‌లో మాత్రమే 76% ఆక్యుపెన్సీ నమోదైంది. సీడెడ్ ప్రాంతంలో రూ.7.3 కోట్ల గ్రాస్ (GST మినహా) వసూలు కాగా, GSTతో కలిపితే రూ.8.5-9 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. వెస్ట్ గోదావరిలో రూ.2.97 కోట్ల గ్రాస్, ఈస్ట్ గోదావరిలో షేర్ రూ.5.2 కోట్లు నమోదు కాగా, గ్రాస్ రూ.8-10 కోట్ల వరకు ఉండొచ్చని ట్రేడ్ టాక్. ఉత్తరాంధ్రలో రూ.5-6 కోట్ల గ్రాస్ రాగా, గుంటూరు, కృష్ణా, నెల్లూరు వంటి ప్రాంతాల్లోనూ సినిమా మంచి ఓపెనింగ్ సాధించింది. తిరుపతిలో ప్రీమియర్, డే 1 కలిపి రూ.1.19 కోట్ల గ్రాస్ రావడం గమనార్హం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో డే 1 నెట్ కలెక్షన్లు రూ.47.4 కోట్లు, గ్రాస్ రూ.57.6 కోట్లు గా నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ ఆక్యుపెన్సీ 57.16% కాగా, నైట్ షోలలో 69.20% ఆక్యుపెన్సీతో స్పష్టమైన పికప్ కనిపించింది.
ఇతర భాషల్లోనూ 'ది రాజాసాబ్' కూడా పుంజుకుంటుంది. హిందీ వెర్షన్ నుంచి తొలి రోజు రూ. 6.5 కోట్ల నెట్, తమిళ్, కన్నడ, మలయాళ భాషల నుంచి కలిపి రూ.0.5-1 కోటి వరకు వచ్చినట్లు అంచనా. దీంతో ఇండియా మొత్తం నెట్ కలెక్షన్లు రూ. 54 కోట్ల మధ్య ఉన్నట్లు సమాచారం. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ప్రభాస్ క్రేజ్ మరోసారి కనిపించింది. అమెరికా సహా విదేశీ మార్కెట్లలో రూ.26-30 కోట్ల గ్రాస్ (USD 3-3.3 మిలియన్లు) సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.90 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదైనట్లు టాక్ నడుస్తోంది. ముందుగానే ప్రిమియర్స్ అనుమతులు, టిక్సెట్స్ రేట్లు ముందుగానే అనుమతి ఇచ్చి ఉంటే.. రూ. 100 కోట్ల మార్క్‌ను దాటే అవకాశమూ ఉండేదని టాక్.


Click it and Unblock the Notifications











