రూ. 100 కోట్లు క్రాసైన ‘తుపాకి’
చెన్నయ్ : హీరో విజయ్, కాజల్ హీరోగా రూపొందిన తమిళ చిత్రం 'తుపాకి' భారీ కలెక్షన్లతో దూసుకెలుతోంది. తాజాగా ఈచిత్రం కలెక్షన్ల పరంగా రూ. 100 కోట్ల మార్క్ క్రాసైంది. తమిళ చిత్రాల మార్కెట్లో 100 కోట్లు క్రాసైన రెండో చిత్రంగా తుపాకి రికార్డు సృష్టించింది. గతంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన 'యంతిరన్'(రోబో) చిత్రం మాత్రమే 100 కోట్లు క్రాసైంది.
కలెక్షన్ల వివరాలను ఈ చిత్ర దర్శకుడు మురుగదాస్ తన ట్విట్టర్లో ఖరారు చేసారు. 'తుపాకి చిత్రం 100 కోట్లు క్రాసైంది. తమిళ చిత్ర సీమలో ఇలాంటి ఫీట్ సాధించిన రెండో సినిమా' అంటూ మురుగదాస్ ట్వీట్ చేసాడు. సినిమాను ఇంద పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు మురుగదాస్ కృతజ్ఞతలు తెలిపారు.
సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...'తుపాకి' చిత్రం ఓపెనింగ్ డే రోజే రూ. 9.25 కోట్ల కలెక్షన్స్ సాధించింది. తమిళ బాక్సాఫీసు వద్ద తొలి మూడు రోజుల విషయానికొస్తే....రూ. 22.15 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా ఈచిత్రం తొలి ఆరు రోజుల్లో రూ. 65.25 కోట్లు రాబట్టింది. ఒక్క తమిళ నాడులోనే ఈచిత్రం రూ. 45 కోట్లు వసూలైంది. మొత్తానికి 11 రోజుల తర్వాత ఓవరాల్ గా ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కు దాటింది.
'తుపాకి' చిత్రం వల్డ్ వైడ్‌గా 1000కి పైగా థియేటర్లలో రిలీజైంది. తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాలు, ఓవర్సీస్ ల్లో కూడా తుపాకి చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. దీపావళి సీజన్లో ఈ చిత్రంలో పాటు షారుఖ్ నటించిన 'జబ్ తక్ హై జాన్', అజయ్ దేవగన్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్' చిత్రాలు విడుదలైనప్పటికీ 'తుపాకి' చిత్రం పోటీని తట్టుకుని కలెక్షన్ల పరంగా దూసుకెళ్లడం గమనార్హం.


Click it and Unblock the Notifications











