RRR తప్పుకోవడంతో.. ఈ సంక్రాంతికి ఒకేసారి ఎగబడిన 10 సినిమాలు.. గెలిచేదెవరు?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి అనగానే ఒక ప్రత్యేకమైన వాతావరణం నెలకొంటుంది. తప్పకుండా ఈ సీజన్ లో ఏ సినిమా విడుదలైన కూడా మంచి పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీసు వద్ద భారీ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని నిర్మాతలకు చాలా నమ్మకం ఉంటుంది. అయితే ఈ సంక్రాంతికి రావాల్సిన RRR సినిమా వాయిదా పడడంతో చాలా చిన్న సినిమాలు కూడా ఒక్కసారిగా సంక్రాంతిపై పడ్డాయి. ఇక రాధే శ్యామ్, బంగార్రాజు సినిమా లో ప్రస్తుతం అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక మిగతా సినిమాల విషయానికి వస్తే.

RRR డేట్ లో మూడు సినిమాలు
జనవరి 7వ తేదీన RRR సినిమా రావాల్సింది. ఇక ఆ సినిమా వాయిదా పడడంతో అదే రోజున రానా దగ్గుబాటి '1945' సినిమాతో పాటు రాంగోపాల్ వర్మ 'RGV మిస్సింగ్' అనే సినిమా కూడా విడుదల కాబోతోంది. ఆది సాయి కుమార్ నటించిన 'అతిథిదేవోభవ' కూడా అదే రోజు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు సినిమాలు సంక్రాంతి సీజన్ కంటే ముందు బాక్సాఫీస్ ను ఎలా స్టార్ట్ చేస్తాయి అనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.

అజిత్ బలం
ఇక జనవరి 12 వ తేదీన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమా తెలుగులో విడుదల కాబోతోంది. అసలైతే ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా విడుదల కావాల్సింది. కానీ RRR సినిమా కారణంగా ఆ సినిమా ఫిబ్రవరి లో కి షిఫ్ట్ అయింది. ఇక ఇప్పుడు అజిత్ నటించిన వాలిమై సినిమాను తెలుగులో 'బలం' అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు.

రాధేశ్యామ్..?
ఇక జనవరి 14 వ తేదీన రాధేశ్యామ్ సినిమా విడుదల అవుతుందా లేదా అనేది ప్రస్తుతం అందరి లోనూ ఎన్నో రకాల అనుమానాలను కలుగజేస్తున్నాయి. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో చాలావరకూ థియేటర్స్ మూతపడ్డాయి. ఫిబ్రవరి వరకు పాక్షికంగా లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా సినిమా థియేటర్స్ కొనసాగుతున్నాయి. కాబట్టి రాధే శ్యామ్ సినిమా విడుదల అవుతుందా లేదా అనేది అనుమానమే.

మెగా అల్లుడి.. దిల్ రాజు తనయుడు
మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ కూడా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అతను నటించిన 'సూపర్ మచ్చి' సినిమా సెకండ్ వీక్ లోనే వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నటించిన మొదటి సినిమా 'హీరో' జనవరి 15వ తేదీన రాబోతోంది. దిల్ రాజు సోదరుడి తనయుడు ఆశిష్ రెడ్డి నటించిన 'రౌడీ బాయ్స్' సినిమా కూడా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

బంగార్రాజు పక్కా..
జనవరి 15వ తేదీ లేదా 13వ తేదీన నాగార్జున బంగార్రాజు సినిమా విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య ముఖ్య పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. గతంలో సోగ్గాడే చిన్నినాయన సినిమాతో సంక్రాంతికి బాక్సాఫీస్ హిట్ అందుకున్న నాగార్జున ఈసారి తనయుడితో కలిసి మరో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

చిన్న సినిమాలు..
మరి కొన్ని చిన్న సినిమాలు కూడా సంక్రాంతి పండక్కి వాటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ప్రముఖ సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన '6 నైట్స్ 7 డేస్' సినిమా తో పాటు రాజశేఖర్ నటించిన 'శేఖర్' అనే సినిమా కూడా ఈ సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే మరికొన్ని చిన్న సినిమాలు కూడా పొంగల్ బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Recommended Video

జనవరి చివరలో..
సంక్రాంతిలోనే కాకుండా జనవరి చివరలో మరికొన్ని సినిమాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. జనవరి 21వ తేదీన 'ధర్మస్థలి' విడుదలవుతుండగా.. జనవరి 26 వ తేదీన 'అతడు ఆమె ప్రియుడు' అనే మరొక చిన్న సినిమా విడుదల కానుంది. వీటితోపాటు 'గాడ్సే', 'ఉనికి', 'సామాన్యుడు', 'లడికి' అనే మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











