దసరా బరిలో స్టార్ హీరోలు.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యేనా?

Tollywood Dasara 2026 Box Office Clash: టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత అత్యంత పోటీ సీజన్‌గా దసరాను పరిగణిస్తారు. విద్యార్థులకు సెలవులు, కుటుంబ ప్రేక్షకుల థియేటర్ సందడి, పండుగ వాతావరణం కలిసి ఈ సీజన్‌ను బంగారు అవకాశంగా మార్చుకోవాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ప్రతి ఏడాది పెద్ద సినిమాలు సంక్రాంతి తరువాత దసరా సమయంలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తుంటారు. అలాగే.. 2026 దసరా సీజన్ కూడా బాక్సాఫీస్ పోరుకు సిద్దమవుతోంది. ఈ సారి దసరా బరిలో టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తమ ప్రతిష్టాత్మక సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు నాని, సాయిదుర్గా తేజ్ సినిమాలు కూడా రేసులోకి వస్తాయనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

చిరంజీవి విశ్వంభర
మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ సోషియో-ఫాంటసీ మూవీ 'విశ్వంభర'.ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. అయితే ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచే విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులు ఇంకా కొనసాగుతుండటంతో విడుదల పలుమార్లు వాయిదా పడింది. గతంలో జూలైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించినట్లు ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. ఒకవేళ ఆగస్టు నాటికి VFX పనులు పూర్తయితే, దసరా సీజన్‌ను టార్గెట్ చేస్తూ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో 'విశ్వంభర'కూడా దసరా బాక్సాఫీస్ రేసులో చేరుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Tollywood Dasara 2026 Box Office Clash Chiranjeevi Balakrishna Nagarjuna Venkatesh Battle

దసరా బుల్లోడిగా వెంకటేష్
విక్టరీ వెంకటేష్ గత కొన్నేళ్లుగా సంక్రాంతి సీజన్‌ను తన సెంటిమెంట్‌గా మార్చుకున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకరవరప్రసాద్ గారు'వంటి విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న వెంకీ మామ ఇప్పుడు దసరా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం:47' (AK-47) ప్రస్తుతం చివరి దశ షూటింగ్ లో ఉంది. కుటుంబ విలువలు, భావోద్వేగాలు, వినోదాన్ని కలగలిపిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ మూడో వారంలో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

100వ సినిమాతో నాగార్జున గ్రాండ్ ఎంట్రీ
కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో మైల్ స్టోన్ గా భావిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక 100వ సినిమా 'కింగ్ 100'కూడా దసరా రేసులో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది. దీన్ని ఆగస్టు కల్లా పూర్తి చేసి.. దసరా బరిలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నాగార్జున ఇందులో భిన్నమైన షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఒకవైపు మైలురాయి సినిమా కావడం, మరోవైపు దసరా సీజన్ కావడంతో ఈ చిత్రంపై ఇండస్ట్రీలో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. అయితే.. త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

గ్యాంగ్‌స్టర్ అవతారంలో బాలయ్య
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమా చేస్తున్నారు. ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో బాలయ్య స్టైలిష్ మాస్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. మొదటి నుంచే దసరా రిలీజ్ టార్గెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగానే షూటింగ్ షెడ్యూల్స్‌ను పూర్తి చేసే పనిలో మేకర్స్ నిమగ్నమయ్యారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గ యాక్షన్, డైలాగ్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి. దసరా బాక్సాఫీస్ వద్ద బాలయ్య ఎలాంటి సంచలనం సృష్టిస్తారో వేచి చూడాల్సిందే.

ఈ స్టార్ హీరోలే కాకుండా న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' మొదట ఆగస్టు విడుదలకు ప్లాన్ చేసినప్పటికీ, ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో సెప్టెంబర్ లేదా దసరా వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సాయిదుర్గా తేజ్ నటిస్తున్న 'సంబరాల ఏటి గట్టు' కూడా చివరి దశకు చేరుకోవడంతో పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా చూస్తే.. దసరా సీజన్‌లో ఒకేసారి బడా హీరోల సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉండటంతో థియేటర్ల వద్ద అసలైన స్టార్ వార్ కనిపించే సూచనలు ఉన్నాయి. ఈ దసరా బాక్సాఫీస్ వార్ లో ఎవరి సినిమా పైచేయి సాధిస్తుంది? ఎవరు బాక్సాఫీస్ విజేతగా నిలుస్తారు? అన్నది మాత్రం విడుదలల తర్వాతే తేలనుంది.

Read more about: chiranjeevi venkatesh nagarjuna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X