అల్లరి బుల్లోడు బోల్తా, హిట్‌లేని వారం
సీనియర్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తీసిన అల్లరి బుల్లోడు భవిష్యత్తు మొదటి షో తోటే తేలిపోయింది. త్రిష-నితిన్‌ల క్రేజీ కాంబినేషన్ సినిమాను రక్షించలేకపోయింది. పాత చింతకాయ పచ్చడి వంటి కథ,కథనాలు సినిమాను ఘోరంగా దెబ్బతీశాయి. సీనియర్ దర్శకులు ట్రెండ్స్‌కి తగినట్టు అప్‌డేట్ కాకపోతే చేదు అనుభవాలు తప్పవని తెలుగుప్రేక్షకులు మరోసారి నిరూపించారు. కేవలం మూడు పాత్రలతో వెంకీ దర్శకత్వం వహించిన మొగుడు, పెళ్ళాం, ఓ దొంగోడు సినిమా ప్రేక్షకులని థియేటర్ల వద్దకు రప్పించలేకపోతోంది. కొన్ని నెలల తర్వాత హాయిగా ఫ్రీగా ఇంటి వద్ద చూసుకోవచ్చనుకుంటున్నారు. ఒక ప్రయోగమే అయినా కథనంలో ఉత్కంఠ లేకపోవడం వల్ల రాజా, శ్రీయ, బ్రహ్మానందం బాగా నటించినా సినిమా అడవిగాచిన వెన్నెల అయింది. శ్రీరాం, గోపికల తమిళ డబ్బింగ్ సినిమా కర్తవ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చాలా కాలం విడుదల కాకుండా నిలిచిపోయిన వీరి వీరి గుమ్మడి పండు అతడు+ఆమె= 9 సినిమాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఆర్ నారాయణమూర్తి అమ్మమీద ఒట్టు సినిమా ఒకవర్గం మాస్ ప్రేక్షకులను కొంతవరకు అలరిస్తోంది. గతవారం విడుదలైన శ్రీహరి ఒక్కడే వసూళ్ళు ఫర్వాలేదనిపించే స్ధాయిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











