రిలీఫ్ కావాలి
పెద్ద హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయంటే.. ప్రేక్షకులు సహజంగానే భారీ అంచనాలు పెంచుకుంటారు. కానీ విచిత్రం ఏమిటంటే.. ప్రేక్షకులనే ఈ హీరోలు అంచనా వేయడంలో అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తుంటారు. ఇమేజ్ చెడిపోకుండా కథలను సైతం తమ ఇమేజ్‌కు అనుకూలంగా మలుచుకునే ఈ పెద్ద హీరోలు.. ఆ క్రమంలో ప్రేక్షకులకు కథలో ఎంత కొత్తదనం ఇస్తున్నాం అన్న విషయాన్ని మాత్రం పట్టించుకోరు.
ఒక చక్కని పాయింట్ చుట్టూ అల్లిన స్టాలిన్ కథలో అసలు పాయింట్ లోపించి.. సాధారణమైన ఫ్యాక్షన్ అనే మూస కథను ఇరికించి దట్టించి ప్రేక్షకులపై వదిలేశారు. థాంక్స్ వద్దు.. సహాయమే ముద్దు అనే నినాదంతో కూడిన ఇతివృత్తంలో ఒక హీరో వందల మందిని అరటితూటలు నరికినట్టు నరకాల్సిన అవసరం ఏమొచ్చిందో రాసిన వారికీ, తీసిన వారికే తెలియాలి.
ఎంతో ఆశించి ఆ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ అందించిన ప్రేక్షకులు, మెగాస్టార్ అభిమానులు.. మొదట్లో కించిత్ నిరాశకు గురైయ్యారు.
సరిగ్గా వారం వ్యవధిలో విడుదలైన నాగార్జున బాస్ చిత్రం ఒక ఎంటర్‌టైనర్‌గా బాగున్నా.. కథ లోపించడం, ముఖ్యంగా క్లయిమాక్స్ సాదాసీదాగా సాగడం ప్రేక్షకులను నిరాశపర్చింది. ఎంతో ఆర్భాటంగా ఈ చిత్రాన్ని 240 పైగా ప్రింట్లతో విడుదల చేశారు. బాస్ చిత్రంపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో అది స్టాలిన్‌కి కలసి వచ్చింది. బాస్ చిత్రానికి తొలుత వచ్చిన టాక్ గనుక కొనసాగి వుంటే అప్పుడు స్టాలిన్‌కి గట్టి పోటీ ఉండేది కానీ.. ఇప్పుడు మళ్లీ స్టాలిన్ కలెక్షన్లు మెరుగుపడ్డాయని తెలుస్తోంది.
అయితే, హీరో నాగార్జున చిత్రాలకు తొలి రెండు వారాలు ఇలాంటి టాక్ రావడం మామూలే అని ఫిలింనగర్ వర్గాల వారు అంటున్నారు. ఆయన గత చిత్రాల రికార్డులను పరిశీలిస్తే.. అన్ని చిత్రాల కన్నా బాస్ చిత్రానికే భారీ ఓపెనింగ్స్ వచ్చాయని చెబుతున్నారు. త్వరలో టాక్ మారి.. క్రమంగా మహిళా ప్రేక్షకులు థియేటర్లకు రావడం మొదలైతే.. బాస్ చిత్రం మళ్లీ పుంజుకుంటుందని నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి ఆశిస్తున్నారు.
పెద్ద హీరోల సినిమాలు రెండూ విడుదల కావడంతో ఇక చిన్న చిత్రాల సందడి మొదలు కాబోతోంది. దీపావళికి అనేక చిన్న బడ్జెట్ సినిమాలు రిలీజ్‌కి క్యూ కట్టాయి.


Click it and Unblock the Notifications











