12 రోజులు రూ.12 కోట్లు
వెంకటేష్, నయనతార జంటగా నటించిన తులసి సినిమా విడుదలైన 12 రోజుల్లో రూ.12 కోట్లను వసూలు చేసినట్టు చిత్ర సమర్పకుడు డాక్టర్ డి రామానాయుడు తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో ఆయన విషయాన్ని చెప్పారు. ఆయన ఇంకా మాట్లాడుతూ....ఈ చిత్ర విజయం వెనుక టీమ్ వర్క్ ఉంది. నా కుమారులు సురేష్ బాబు, వెంకటేష్ చక్కగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా వెంకటేష్ కాలికి గాయం కూడా అయింది. అయినా వెనకంజ వేయకుండా సినిమాను పూర్తి చేశాడు. సినిమా కోసం పని చేసిన మిగతావారు కూడా అంతే చిత్తశుద్ధితో చేశారు...వారందరికీ నా ధన్యవాదాలు..నా అనుభవంలో ఎన్నో ఎత్తుపళ్లాలను చూశాను...విజయం సాధించినపుడు ఒదిగి ఉండడం, ఓటమి ఎదురైనపుడు ధైర్యంగా ఉండడం నేర్చుకున్నాను..అందుకే సంతోషంగా ఉన్నాను...మా సినిమాలను ఆదరిస్తున్న రాష్ట్ర ప్రజలందరికి ధన్యవాదాలు...అన్నారు.
హీరో వెంకటేష్ మాట్లాడుతూ...సినిమాకు పనిచేస్తున్నపుడు ఎపుడూ టెన్షన్ ఫీల్ కాలేదు..దర్శకుడు బోయపాటి, నిర్మాత సురేష్ బాబు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఈ సినిమా విజయంలో కీలక పాత్ర వహించారు..ప్రేక్షకులు, అభిమానులు అందించిన ఆశీస్సులు చిత్ర విజయానికి తోడ్పడ్డాయి..అతులిథ్ నటన అద్భుతం...లక్ష్మి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే తరువాత తులసి విజయం హ్యాట్రిక్ విజయమని ప్రేక్షకులు అంటున్నారు...అన్ని సినిమాలకు మల్లే ఈ సినిమాకు సైతం కష్టపడ్డాను...విజయాలు వచ్చినపుడు పొంగిపోకుండా, ఓటములు ఎదురైనపుడు కుంగిపోకుండా ఉండే తత్వాన్ని మా నాన్న నుంచి నేర్చుకున్నాను...అన్నారు.
పరుచూరి బ్రదర్స్, దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, నిర్మాత సురేష్ బాబు తదితరులు ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











