‘యూరి: ది సర్జికల్ స్ట్రైక్’ 50 రోజుల కలెక్షన్.. రూ. 237 కోట్లు!
కాశ్మీర్ యూరి సెక్టార్లలో ఇండియన్ ఆర్మీ సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటన ఆధారంగా రూపొందిన చిత్రం 'యూరి-ది సర్జికల్ స్ట్రైక్'. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా విక్కీ కౌశల్, పరేష్ రావల్, యామీ గౌతమ్, కీర్తి కుల్‌హరి, మోహిత్ రైనా ముఖ్య పాత్రలు పోషించారు.
జనవరి 11న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. తాజాగా 50 రోజులు పూర్తి చేసుకుని భారీ వసూళ్లు నమోదు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. 50 రోజుల తర్వాత కూడా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది.

50 డేస్ కలెక్షన్
ఇండియన్ బాక్సాఫీసు వద్ద 50 రోజులు పూర్తి చేసుకుని ఇప్పటి వరకు రూ. 237.36 కోట్లు వసూలు చేసింది. విడుదలై 7వ వారంలోనూ రూ. 6.65 కోట్ల షేర్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది.

బడ్జెట్ ఎంత?
ఈ చిత్ర నిర్మాణానికి, ప్రింట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి మొత్తం రూ. 45 కోట్లు ఖర్చు పెట్టారు. ఖర్చు పెట్టిన మొత్తానికి నాలుగు రెట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ మూవీని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు మరికొన్ని రోజులు సినిమాను థియేటర్లో రన్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇదే తొలిసారి
సినిమా విడుదలైన 50వ రోజు కూడా ఈ చిత్రం బాక్సాఫీసువద్ద రూ. 2 కోట్ల షేర్ వసూలు చేసింది. బాలీవుడ్ చరిత్రలో ఒక మూవీ 50వ రోజు ఇంత భారీ మొత్తం వసూలు చేయడం ఇదే తొలి సారి అని ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

త్వరలో ‘సర్జికల్ స్ట్రైక్ 2’
పుల్వామా ఉగ్రవాదుల దాడి తర్వాత భారత సైన్యం ప్రతికార చర్యల్లో భాగంగా మరోసారి సర్జికల్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ వివామానాల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి ప్రవేశించి వెయ్యి కిలోల బాంబులను ఉగ్రవాద శిబిరాలపై జార విడిచి దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమార్చారు. దీనిపై త్వరలో ‘సర్జికల్ స్టైక్ 2' మూవీ తీసేందుకు పలువురు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆసక్తి చూపుతున్నారు.


Click it and Unblock the Notifications











