Ustaad Bhagat Singh: పాన్ ఇండియా మూవీలకే సవాల్.. ఆంధ్రా- నైజాంలలో ఒకే ఒక్కడిగా పవన్ కళ్యాణ్!
పవన్ కళ్యాణ్... ఆ పేరే ఒక ప్రభంజనం. మూడు దశాబ్ధాలుగా తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేస్తున్న పేరు పవన్ కళ్యాణ్. కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవంగా, చిత్ర పరిశ్రమలో అగ్రనటుడిగా, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వెలుగొందుతున్నారు పవన్. ఒక నటుడిగా కంటే ఆయన వ్యక్తిత్వాన్నే ప్రజలు ఇష్టపడతారు. అందుకే జనరేషన్స్ మారుతున్నా పవన్ క్రేజ్‌లో ఏమాత్రం మార్పు రాలేదంటే అతిశయోక్తి లేదు. రాజకీయాలు, పాలనలో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ తనను తెరమీద చూసి మురిసిపోయే కోట్లాది మంది అభిమానులను అలరించేందుకు ఎంతో కష్టపడి సినిమాలు చేస్తున్నారు జనసేనాని.
పాన్ ఇండియా సినిమాల హవా
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీల హడావుడి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు కనిపిస్తోంది. చిన్నాచితకా పరిశ్రమలకు చెందిన వారు కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్‌లు, కలెక్షన్స్ లెక్కలతో సోషల్ మీడియా, సినీవర్గాల్లో డిస్కషన్స్‌లో ఉంటాయి. అలాంటిది కేవలం రీజనల్ సినిమాలతోనే రికార్డులు బద్ధలు కొడుతున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా ఆయన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ద్వారా మరో సంచలనం సృష్టించారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత?
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు నవీన్ యెర్నెనీ, వై రవిశంకర్‌లు దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన రాశీ ఖన్నా, శ్రీలీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తుండగా.. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. అయనంకా బోస్ సినిమాటోగ్రాఫర్‌గా, ఛోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత దాదాపు 14 ఏళ్లకు హరీశ్ శంకర్- పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలుత మార్చి 26వ తేదీన రిలీజ్‌ను ఖరారు చేసుకున్న ఈ చిత్రం అనూహ్య పరిణామాల మధ్య ఉగాది కానుకగా మార్చి 19న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ బిజినెస్
పవన్ కళ్యాణ్- హరీశ్ శంకర్ కాంబోతో పాటు టీజర్, ట్రైలర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ హైప్‌కు తగినట్లుగానే ఉస్తాద్‌కు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలు, ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ 54 కోట్లు రూపాయలు, సీడెడ్ థియేట్రికల్ రైట్స్ 16 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 12 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేశాయి. దాంతో ఉస్తాద్ భగత్ సింగ్‌కు వరల్డ్ వైడ్‌గా దాదాపు 137 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో పవన్ కళ్యాణ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 140 కోట్ల రూపాయల షేర్.. 250 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది విశ్లేషకులు విలువ కట్టారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఏపీ, టీజీ బిజినెస్
ప్రత్యేకించి ఆంధ్రా, నైజాంలలో ఉస్తాద్ భగత్ సింగ్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటక, ఓవర్సీస్ మినహాయిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు 120 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో రిలీజ్ కానున్న యష్ నటించిన పాన్ ఇండియా మూవీ కూడా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 120 కోట్లకు సొంతం చేసుకుంది. దీనిని బట్టి పవన్ మేనియాను అర్ధం చేసుకోవచ్చు. రీజనల్ సినిమాగా విడుదలవుతూ తెలుగు రాష్ట్రాల్లో పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా ఉస్తాద్ బిజినెస్ చేయడం పవన్ కళ్యాణ్ ఛరిష్మాకు నిదర్శనం. ఇక టాలీవుడ్ హీరోలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాలు పరిశీలిస్తే..
పాన్ ఇండియా సినిమాలకు పవన్ సవాల్
పుష్ప 2 (213 కోట్ల రూపాయలు) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ (191 కోట్ల రూపాయలు), కల్కి 2898 ఏడీ (168 కోట్ల రూపాయలు), సలార్ (145 కోట్ల రూపాయలు), ఓజీ (145 కోట్ల రూపాయలు), ది రాజాసాబ్ (126 కోట్ల రూపాయలు), బాహుబలి 2 (122 కోట్ల రూపాయలు), గేమ్ ఛేంజర్ (122 కోట్ల రూపాయలు), సాహో (121.6 కోట్ల రూపాయలు), ఆది పురుష్ (120 కోట్ల రూపాయలు), ఉస్తాద్ భగత్ సింగ్ (120 కోట్ల రూపాయలు), దేవర పార్ట్ 1 (113 కోట్ల రూపాయలు)గా ఉన్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ లిస్ట్‌ను బట్టి చూస్తే.. ఇందులో ఉస్తాద్ భగత్ సింగ్ తప్పించి మిగిలిన అన్ని చిత్రాలు కూడా.. పాన్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం. భారీ బడ్జెట్, పాన్ ఇండియా నటీనటులతో వస్తున్న సినిమాలకు ధీటుగా పవన్ తన క్రేజ్‌తో తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకుంటున్నాడు.


Click it and Unblock the Notifications


















