Chhaava Day 24 Collections : 700 కోట్ల క్లబ్‌లోకి ఛావా... విక్కీ వసూళ్ల సునామీ, 24వ రోజు ఎన్ని కోట్లంటే?
విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితకథ ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలై 24 రోజులు కావొస్తున్నా నేటికీ హౌస్‌ఫుల్ బోర్డ్స్‌తో ఛావా థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 24వ రోజు విక్కీ కౌశల్ చిత్రానికి ఎన్ని కోట్ల వసూళ్లు దక్కాయి? ఏయే రికార్డులు బద్ధలయ్యాయో చూస్తే :
ఛావాలో శంభాజీగా విక్కీ కౌశల్, ఆయన సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఛావాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఛావా నాటి నుంచి నేటి వరకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు ఏకంగా రూ.32 కోట్ల కలెక్షన్స్‌తో విక్కీ కౌశల్ కెరీర్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ఛావా నిలిచింది. ఆ తర్వాత తొలి వారంలో రూ.220 కోట్లు.. రెండో వారంలో రూ.181 కోట్లు.. మూడో వారంలో రూ.85 కోట్లను రాబట్టింది. సహజంగా మూడో వారంలో ఏ సినిమా అయినా డల్ అవుతుంది కానీ ఛావా మాత్రం అంతకంతకూ వసూళ్లను రాబడుతూనే ఉంది.
తొలుత హిందీలో మాత్రమే ఛావాను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. హిందీలో తెరకెక్కినా దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఛావాను నెత్తిన పెట్టుకోవడంతో మిగిలిన భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా మహిళా దినోత్సవం కానుకగా మార్చి 7వ తేదీన ఛావాను ప్రేక్షకుల ముందుకొచ్చింది గీతా ఆర్ట్స్ సంస్థ. అంచనాలను నిజం చేస్తూ తెలుగులో ఛావా దుమ్మురేపుతోంది. తొలి రోజు రూ. 3 కోట్లు, రెండో రోజు రూ.3.5 కోట్లు రాబట్టిన విక్కీ కౌశల్ చిత్రం మూడో రోజు ఆదివారం రూ.3 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో ఛావా తెలుగు వెర్షన్‌లో రూ. 11 కోట్ల గ్రాస్ రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు రూ.670 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఛావా చిత్రం పలు సినిమాల రికార్డులను బద్ధలు కొట్టింది. ఇక 24వ రోజైన ఆదివారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 13 కోట్లు రాబట్టింది. ఇందులో హిందీ నుంచి రూ. 10 కోట్లు, తెలుగు నుంచి రూ.3 కోట్ల వసూళ్లు అందుకుంది. ఈ కలెక్షన్స్‌తో ఛావా రూ.700 కోట్ల క్లబ్‌లో చేరింది. కేవలం 24 రోజుల్లోనే ఈ సినిమా రూ.713.95 కోట్లను సాధించి అరుదైన ఫీట్ అందుకుంది. అంతేకాదు.. రూ.700 కోట్ల క్లబ్‌లో చేరిన 9వ బాలీవుడ్ చిత్రంగా ఛావా నిలిచింది. ఇప్పటి వరకు పీకే, దంగల్, బజరంగీ భాయిజాన్, సీక్రెట్ సూపర్‌స్టార్, పఠాన్, జవాన్, యానిమల్, స్త్రీ2లు ఈ ఫీట్ సాధించాయి.
థియేటర్‌లలో మరో పెద్ద సినిమా లేకపోవడంతో ఛావాకు ఇప్పట్లో ఎదురే లేదని .. ఈ జోరు ఇలాగే కొనసాగితే విక్కీ కౌశల్ చిత్రం రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఛావా తన లాంగ్ రన్‌లో ఎలాంటి మేజిక్ చేస్తుందో?


Click it and Unblock the Notifications











