Chhaava Box Office: బాహుబలి 2 ఔట్.. రికార్డు వసూళ్లతో ఛావా సంచలనం!
ఉరి, సర్దార్ ఉదమ్, శ్యామ్ బహదూర్ చిత్రాలతో మంచి ఊపు మీదున్న బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ నటించిన మూవీ ఛావా. మహారాష్ట్రకు చెందిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. మడాక్ ఫిల్మ్స్ పతాకంపై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మించగా.. ఫిబ్రవరి 14న ఛావా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
కొన్నేళ్లుగా సౌత్ సినిమాల దెబ్బకి బాలీవుడ్ నిలబడలేకపోతోంది. హై టెక్నికల్ వాల్యూస్‌తో, భారీ స్టార్ క్యాస్టింగ్‌తో సినిమాలు వస్తున్నప్పటికీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. సౌత్ చిత్రాల్లో ఉంటున్న ఎమోషన్, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్, కమర్షియల్ హంగులకు నార్త్ జనాలు ఫిదా అయిపోతున్నారు. దీంతో ఏ సినిమా తీయాలో తెలియక బాలీవుడ్ మేకర్స్ తలలు పట్టుకుంటుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో స్త్రీ 2 వంటి ఏవో ఒకటి రెండు సినిమాలు తప్పించి బాలీవుడ్‌లో ఎలాంటి మెరుపులు లేవు.

ఈ ఏడాది ఎలా ఉంటుందోనంటూ కొత్త సంవత్సరం బాక్సాఫీస్ పరుగు ప్రారంభించిన బాలీవుడ్‌కు ఛావా రూపంలో మంచి ఓపెనింగ్ దక్కింది. విక్కీ కౌశల్ నట విశ్వరూపంతో థియేటర్లలో జనాలు పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతున్నారు. ఇటీవలి కాలంలో సమాజంపై ఈ స్థాయిలో ప్రభావం చూపిన సినిమా మరొకటి లేదు. పిల్లలు, పెద్దలు ఈ సినిమా చూసి భావోద్వేగానికి గురవుతూ.. కన్నీటి పర్యంతమవుతున్నారు. మౌత్ టాక్‌తో పాటు సోషల్ మీడియాలోనూ ఛావాకు మంచి పబ్లిసిటీ దక్కుతోంది.
ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.730 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఛావా. తద్వారా ఈ ఘనత సాధించిన హిందీ చిత్రాల్లో విక్కీ కౌశల్ సినిమా 9వ స్థానంలో నిలిచింది. హిందీలో తెరకెక్కినప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఛావాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 7న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో విడుదల చేసింది. తొలి వారం ముగిసేసరికి తెలుగులో దాదాపు రూ.12 కోట్ల వరకూ వసూళ్లు రాబట్టింది ఛావా. తెలుగులో విడుదల కావడం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. దాదాపు 25 రోజులు కావొస్తున్నా ఛావాకు హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడుతూనే ఉన్నాయి. పరీక్షల సీజన్‌లోనూ ఈ సినిమా సాలీడ్ బుకింగ్స్ జరుగుతున్నాయంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు.
ఒక్క సినిమా రికార్డును బద్ధలు కొడుతూ వడివడిగా రూ.1000 కోట్ల దిశగా పరుగులు తీస్తోన్న ఛావా తాజాగా రాజమౌళి - ప్రభాస్‌ల ఎపిక్ మూవీ బాహుబలి 2 రికార్డుని బద్ధలు కొట్టింది. హిందీలో బాహుబలి 2 లాంగ్ రన్‌లో ఏకంగా రూ.510 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించగా.. ఇప్పుడు ఈ రికార్డును ఛావా క్రాస్ చేసింది. 25 రోజుల్లోనే రూ.516 కోట్ల వసూళ్లను సాధించి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు విక్కీ కౌశల్. అంతేకాదు.. అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో ఛావా 6వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం విక్కీ కౌశల్- రష్మికల జోరు చూస్తుంటే ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బద్ధలు కొట్టేలా కనిపిస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











