Chhaava Day 19 Collections : పడిపోయిన బుకింగ్స్.. ఛావాకు షాకిచ్చేలా కలెక్షన్స్, ఎన్ని కోట్లంటే?
మన పూర్వీకుల గొప్పదనం, భారత వీరుల శౌర్య పరాక్రమాలను కళ్లకు కట్టినట్లు చూపెడుతోంది ఛావా. మన చరిత్రను, వారసత్వాన్ని తెలుసుకునేందుకు పిల్లలు, పెద్దలు తీవ్రంగా ఉత్సాహం చూపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత మీడియాలో, సోషల్ మీడియాలో , ప్రజల్లో ఓ సినిమా గురించి ఇంతలా చర్చ జరగడం ఇదే తొలిసారి. ఈ పరిణామాలతో ఛావా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మరి 19వ రోజు విక్కీ కౌశల్ మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే :
మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘటనలు, ఆయన పరిపాలన, మొగల్ చక్రవర్తి ఔరంగజేబుతో యుద్ధం వంటి యదార్ద సంఘటనల ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఛావా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శంభాజీగా విక్కీ కౌశల్, ఆయన సతీమణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహ్మన్ స్వరాలు సమకూర్చారు.

నటీనటుల పారితోషికాలు, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిసి ఛావా సినిమాకు దాదాపు రూ.130 కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఛావాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. టీజర్ , ట్రైలర్లకు తోడు శంభాజీ లుక్‌లో విక్కీ కౌశల్ పోస్టర్లు రిలీజ్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఛావా ఆ రోజు నుంచి నేటి వరకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లను రాబట్టిన ఈ సినిమా అనేక హిట్ చిత్రాల రికార్డులను బద్ధలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.630 కోట్లకు పైగా మార్క్‌ను క్రాస్ చేసిన ఛావా ఈ వసూళ్లతో భారత్‌లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన 25 స్థానాలలో ఒకటిగా ప్లేస్ దక్కించుకుంది. లాంగ్ రన్‌లో ఛావా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
గత వీకెండ్ వరకు దుమ్మురేపిన ఛావా సోమవారం నుంచి బాక్సాఫీస్ వద్ద డల్ అయ్యింది. సోమ, మంగళవారాల్లో రూ.10 కోట్ల లోపే వసూళ్లు సాధించింది. మార్చి 3న రూ. 9 కోట్లు సాధించగా.. 19వ రోజైన మంగళవారం ప్రపంచవ్యాప్తంగా రూ. 7 కోట్లు మాత్రమే రాబట్టింది. హిందీ బెల్ట్‌లో ఆక్యూపెన్సీ కూడా పడిపోతూ వస్తోంది. మంగళవారం మార్నింగ్ షోలకు 6.89 శాతం, మ్యాట్నీ షోలకు 9.61 శాతం, ఫస్ట్ షోకు 9.96 శాతం, నైట్ షోకు 12.81 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో 1217 షోలు, ముంబైలో 1132 షోలు పడ్డాయి. మార్చి 7 నుంచి తెలుగులో ఛావా విడుదల కానున్న నేపథ్యంలో ఈ షోలు, కలెక్షన్స్ సినిమాకు ప్లస్ అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











