Chhaava Day 21 Collections : బాక్సాఫీస్ వద్ద డల్‌గా ఛావా.. షాకిచ్చేలా వసూళ్లు, విక్కీ మూవీకి ఎన్ని కోట్లంటే?
ఛత్రపతి శివాజీ తర్వాత మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఛత్రపతి శంభాజీ మహరాజ్ యుద్ధాలు, ఆయన పరిపాలన, మొగల్ చక్రవర్తి ఔరంగజేబుతో వైరం, శంభాజీ త్యాగాలే ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా ఛావా. రిలీజైన నాటి నుంచి నేటి వరకు వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ చారిత్రక సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. తాజాగా 21వ రోజు ఛావా సినిమాకు ఎన్ని కోట్ల వసూళ్లు వచ్చాయో పరిశీలిస్తే :
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శంభాజీగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, ఆయన సతీమణి ఏసుభాయిగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్ పోషించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. ఏఆర్ రెహ్మన్ సంగీత సారథ్యం వహించారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాకు నిర్మాణ బాధ్యతలు వహించారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం కానుకగా ఛావా ప్రేక్షకుల ముందుకొచ్చింది.

శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నట విశ్వరూపం, ఏఆర్ రెహ్మాన్ బీజీఎం, పాటలు అన్ని కలిసి ఈ సినిమాను ఎక్కడో నిలబెట్టాయి. సినిమా చూస్తున్న వారు చరిత్రలో లీనమై దాని నుంచి బయటికి రాలేకపోయారు. శంభాజీ త్యాగాలను చూసి తట్టుకోలేక థియేటర్‌లో చిన్నారులు, పెద్దలు కంటతడి పెడుతూ దానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పెడుతుండటంతో ఇవి కాస్తా వైరల్ అవుతున్నాయి.
హిందీలో ఉన్న ఈ సినిమాను ఇతర భాషల్లోనూ విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. దీనిలో భాగంగా మార్చి 7న తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేసింది. గీతా ఆర్ట్స్ సంస్థ ఛావా తెలుగు రైట్స్‌ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓ రేంజ్‌లో జరిగినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయితే నెల్లూరు జిల్లాలో ఛావా సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ ఏపీ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మొహమ్మద్ జిలా ఉల్ హకీ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. మొగల్ చక్రవర్తి ఔరంగజేబును ఈ సినిమాలో అత్యంత క్రూరుడిగా చూపించారని, చరిత్రను వక్రీకరించారని ఉల్ హకీ ఆరోపించారు. ఈ సినిమాపై నిషేధం విధించకుంటే మత ఘర్షణలు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

రిలీజైన నాటి నుంచి నేటి వరకు ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లను రాబట్టిన ఛావా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.630 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మూడు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఛావా .. తొలి రెండు వారాల మాదిరిగా అద్భుతాలు చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో 21వ రోజు వసూళ్లను పరిశీలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా రూ.6 కోట్ల వసూళ్లను రాబట్టింది. మార్చి 7 నుంచి తెలుగులో సినిమా అందుబాటులోకి రావడంతో పాటు వీకెండ్ మొదలు కానుండటంతో ఛావా మరోసారి మేజిక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











