Chhaava Day 28 Collections: పడిపోయిన ఛావా వసూళ్లు.. విక్కీ కౌశల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
భారతదేశాన్ని పరిపాలించిన గొప్ప రాజుల్లో ఒకరైన ఛత్రపతి శివాజీ తనయుడిగా మరాఠా సామ్రాజ్య పాలనా బాధ్యతలు స్వీకరించిన ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఛావా. గత కొద్దినెలలుగా డల్‌గా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్‌కి తిరిగి ఊపిరి పోసిన చిత్రంగా ఛావా నిలిచింది. ఇప్పటికే రూ.750 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా రూ.1000 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో 28వ రోజు ఛావా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే:
ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ , శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్నలు లీడ్ రోల్ పోషించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. అకాడమీ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహ్మన్ స్వరాలు సంగీత సారథ్యం వహించారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఛావాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

టీజర్ , ట్రైలర్లు , ప్రమోషన్ కార్యక్రమాలకు తోడు పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో ఛావాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. హిందీలో తెరకెక్కినప్పటికీ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్లు రాబట్టింది. తెలుగు ప్రేక్షకుల కోసం మార్చి 7న ఈ సినిమాను తెలుగు నాట విడుదల చేయగా ఇక్కడా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది.
ఇక 28వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే గురువారం స్వల్పంగా ఛావా జోరు తగ్గింది. హిందీలో రూ.4 కోట్లు, తెలుగులో రూ. కోటి చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 5 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. గురువారంతో ముగిసిన నాలుగో వారానికి గాను ఛావా రూ.58 కోట్లు రాబట్టింది. నాలుగో వారంలో హిందీలో రూ.45.5 కోట్లు, తెలుగులో రూ.13 కోట్ల వసూళ్లు అందుకుంది. శుక్రవారం హోలీ పర్వదినం కావడంతో పాటు వీకెండ్ కూడా మొదలు కావడంతో ఛావాకు కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

అయితే హిందీలో జాన్ అబ్రహం నటించిన డిప్లొమాట్ సినిమా విడుదల కానుంది. దేశభక్తి, యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో వచ్చిన డిప్లొమాట్‌పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై మరింత బజ్ తీసుకొస్తున్నాయి. దీంతో డిప్లొమాట్ ఎఫెక్ట్ ఛావాపై ఉంటుందని బీటౌన్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో గురువారంతో ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ముగియడంతో పిల్లలు ఫ్రీ అయ్యారు.. ఈ ప్రభావం ఖచ్చితంగా వసూళ్లపై ఉంటుందని భావిస్తున్నారు. చూద్దాం మరి ఈ వీకెండ్‌లో ఛావా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో?


Click it and Unblock the Notifications











