Chhaava Day 30 Collections: విక్కీ కౌశల్ మాస్ బీభత్సం.. కలెక్షన్స్‌లో రేర్ ఫీట్, 30వ రోజు ఎన్ని కోట్లంటే?
నిజ జీవిత గాథలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగుంటుందని ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు నిరూపించాయి. అలాంటిది చారిత్రక కథాంశం, దేశభక్తి దానికి జతకలిస్తే సినిమా మామూలుగా ఉండదు. ఇప్పుడు ఛావా సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది. మరాఠాల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో 30వ రోజు ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ , శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్నలు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. మ్యాస్ట్రో ఏఆర్ రెహ్మన్ సంగీతం సమకూర్చారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఛావాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్.. నాలుగో వారంలో రూ.60 కోట్లను ఛావా చిత్రం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు రూ. 750 కోట్లకు పైగా కలెక్షన్లు అందుకుంది. విడుదలై 30 రోజులు కావొస్తున్నా ఛావా సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతూనే ఉన్నారు. 29వ రోజు నాటి వసూళ్లలో పుష్ప 2, స్త్రీ 2 రికార్డులను అధిగమించిన విక్కీ కౌశల్ చిత్రం రూ.1000 కోట్ల టార్గెట్‌తో దూసుకెళ్తోంది.
ఇక 30వ రోజు నాటి ఛావా వసూళ్ల విషయానికి వస్తే హోలీనాడు కుమ్మేసిన విక్కీ కౌశల్.. వీకెండ్‌లోనూ దుమ్మురేపుతున్నాడు. శనివారం ప్రపంచవ్యాప్తంగా రూ.8.5 కోట్లు రాబట్టింది. హిందీలో రూ.7.5 కోట్లు, తెలుగులో రూ. 84 లక్షల కలెక్షన్లను అందుకుంది ఛావా. జాన్ అబ్రహం డిప్లొమాట్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో విక్కీ కౌశల్ తన జోరును నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు. అయితే తెలుగులో మాత్రం కోర్ట్, దిల్‌రూబాలు కొంతమేర ఛావాపై ప్రభావం చూపుతున్నాయి. ఈ వీకెండ్ కూడా విక్కీ కౌశల్ ఘనంగానే ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాగా.. 30వ రోజు వసూళ్లలో ఛావా చిత్రం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 30వ రోజు కలెక్షన్స్‌లో విక్కీ కౌశల్ గత చిత్రం ఉరి ది సర్జికల్ స్ట్రైక్స్ సినిమా రూ.4.7 కోట్లతో ఆల్ టైమ్ టాప్ బాలీవుడ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ 2 రూ.3.35 కోట్లు, అల్లు అర్జున్ - సుకుమార్‌ల పుష్ప 2 రూ.2.9 కోట్ల వసూళ్లు సాధించాయి. ఇప్పుడు 30వ రోజు రూ.8.5 కోట్ల కలెక్షన్స్‌తో అన్ని సినిమాలను దాటేసి ఛావా టాప్ ప్లేస్‌లో కూర్చొంది. విక్కీ కౌశల్ జోరు చూస్తుంటే మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో?


Click it and Unblock the Notifications











