Chhaava Day 31 Collections: వీకెండ్‌లో కుమ్మేసిన ఛావా.. విక్కీ కౌశల్ రేర్ ఫీట్, 31వ రోజు ఎన్ని కోట్లంటే?
ఫిబ్రవరి, మార్చి లాంటి అన్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్. ఆయన హీరోగా నటించిన ఛావా ఊహకందని రేంజ్‌లో వసూళ్ల వర్షం కురిపిస్తూ రికార్డులను తిరగరాస్తోంది. దాదాపు రూ. 750 కోట్లకు కలెక్షన్స్‌తో వడివడిగా రూ.1000 కోట్ల దిశగా సాగిపోతున్న ఛావా 30 రోజుల మార్క్ చేరుకుంది. ఈ నేపథ్యంలో 31వ రోజు విక్కీ కౌశల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే :
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంతో తెరకెక్కిన ఛావాలో ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ , శంభాజీ సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్నలు నటించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించగా.. స్వర మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ సంగీతం సమకూర్చారు. దాదాపు రూ.130 కోట్లకు పైగా బడ్జెట్‌తో మడోక్ పిక్చర్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఛావాను నిర్మించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ఛావాను ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు.

తొలుత హిందీలో మాత్రమే దేశవ్యాప్తంగా విడుదలైన ఛావాను తెలుగు ప్రేక్షకుల కోసం మార్చి 7న తెలుగులోనూ విడుదల చేశారు. ఈ ప్లాన్ బాగా వర్కవుట్ అయ్యింది. తెలుగునాట ఛావాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. రోజుకు రూ. కోటి తగ్గకుండా దుమ్ములేపుతున్నాడు విక్కీ కౌశల్. ఈ వసూళ్లు సినిమాకు బాగా ప్లస్ అవ్వడంతో పాటు అనేక కొత్త రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు విశ్కీ కౌశల్. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో పాటు శంభాజీగా విక్కీ నట విశ్వరూపంతో థియేటర్లలో ప్రేక్షకులు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నారు.
తొలి వారంలో రూ.220 కోట్లు .. రెండో వారంలో రూ.182 కోట్లు.. మూడో వారంలో రూ. 87 కోట్.. నాలుగో వారంలో రూ.60 కోట్లను అందుకున్న ఛావా తనకు బాగా అచ్చొచ్చిన వీకెండ్‌లో మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించింది. శుక్రవారం హోలీ పండుగ నాడు రూ. 8. కోట్లు, శనివారం రూ. 8.5 కోట్లు రాబట్టిన ఛావా .. 31వ రోజైన ఆదివారం రూ. 9 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇందులో హిందీ నుంచి రూ. 8 కోట్లు, తెలుగులో రూ. కోటి వసూలు చేసింది. మొత్తంగా ఐదో వారంతంలో ఛావా చిత్రం రూ. 25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను అందుకుంది.
దీనితో కలిపి ఛావా ఒక్క హిందీలోనే రూ. 548.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఐదో వీకెండ్‌లో భారీ వసూళ్లను అందుకుని ఛావా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఐదో వారాంతంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఛావా నిలిచింది. ఇప్పటి వరకు శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 (రూ.12.15 కోట్లు) టాప్‌లో ఉండగా , ఇప్పుడు రూ.17 కోట్ల కలెక్షన్స్‌తో స్త్రీ 2 రికార్డును బద్ధలు కొట్టాడు విక్కీ కౌశల్. ఈ రెండు సినిమాల తర్వాత ప్లేస్‌లో అల్లు అర్జున్ - సుకుమార్‌ల పుష్ప 2 (12.5 కోట్లు) నిలిచింది. సోమవారం నుంచి పలు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఛావా వసూళ్లు నెమ్మదించే అవకాశం కనిపిస్తోంది. మరి లాంగ్ రన్‌లో విక్కీ కౌశల్ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











