Sankranthiki Vasthunam Box Office : వెంకటేష్ ఊచకోత .. 250 కోట్ల కలెక్షన్స్‌తో మాస్ జాతర
టాలీవుడ్ అగ్రనటుడు విక్టరీ వెంకటేష్ హీరోగా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఏమాత్రం తగ్గడం లేదు. దాదాపు రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో ఈ సంక్రాంతికి విజేతగా నిలవడంతో పాటు 2025ను టాలీవుడ్ ఘనంగా ప్రారంభించేలా చేశాడు వెంకటేష్. రెండు వారాలు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడో వారంలోనూ అదే స్థాయిలో దుమ్మురేపుతోంది. రూ.300 కోట్ల దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సంక్రాంతికి వస్తున్నాం 17వ రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు.
సంక్రాంతి సెలవుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేసిన వెంకటేష్ .. వేగంగా రూ. 100 , రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి విశ్లేషకులకు షాకిచ్చాడు. అటు ఓవర్సీస్‌లోనూ మిలియన్ డాలర్ల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా. ఫెస్టివల్ సీజన్ ముగిసినా ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ కారణంగా ఈ చిత్రం రూ. 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి.. ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా లాభాలను పంచింది. టాలీవుడ్ సీనియర్ హీరోలలో రూ. 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి హీరోగా వెంకటేష్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
ఇకపోతే.. 16 రోజుల వరకు నైజాంలో రూ.38.55 కోట్లు, సీడెడ్‌లో రూ.16.93 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.20.19 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.12.92 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 8.32 కోట్లు, గుంటూరులో రూ.9.93 కోట్లు, కృష్ణాలో రూ.9.08 కోట్లు, నెల్లూరులో రూ. 4.35 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 120.27 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.8.04 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 15.70 కోట్లు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.193.80 కోట్ల గ్రాస్ అందుకోగా ప్రపంచవ్యాప్తంగా రూ.251 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది.
ఇక 17వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ మూవీ బుధవారం రూ. 2.24 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. శుక్రవారం నుంచి వీకెండ్ ప్రారంభం కానుండటం, మరో పెద్ద సినిమా లేకపోవడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద వెంకటేష్ చిత్రం ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











