Sankranthiki Vasthunam Box Office : మెగాస్టార్ తర్వాత వెంకీయే.. వసూళ్లలో రేర్ ఫీట్ , ఎన్ని కోట్లంటే?
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. తొలి వారంలోనే ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలవడంతో పాటు నిర్మాత దిల్‌రాజ్ కంపెనీకి తిరిగి ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలో 9వ రోజు వెంకటేష్ చిత్రం ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే :
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
ఓపెనింగ్స్‌తో తన విధ్వంసం ఎలా ఉంటుందో హింట్ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ తొలి వారంలోనే 200 కోట్ల వసూళ్లు రాబట్టాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను ఛేదించడంతో పాటు లాభాల పంట పండించింది ఈ సినిమా. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తద్వారా ఈ ఏడాది రిలీజైన భారతీయ చిత్రాల్లో 200 కోట్ల గ్రాస్ అందుకున్న తొలి సినిమాగా వెంకటేష్ రికార్డుల్లోకి ఎక్కాడు. గతేడాది సంక్రాంతికి సైంధవ్‌గా వచ్చి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను అందుకున్న వెంకటేష్.. ఇప్పుడు ఏడాది తిరిగేసరికి తన కెరీర్‌లోనే ఆల్‌టైం హైయ్యెస్ట్ కలెక్షన్ల చిత్రాన్ని అందుకున్నాడు. నలుగురు అగ్ర కథానాయకుల్లో రూ.200 ప్లస్ కలెక్షన్స్ సాధించిన రెండో హీరోగా వెంకీ నిలిచారు. ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి రెండు సార్లు (సైరా, వాల్తేర్ వీరయ్య) ఈ ఫీట్‌ను అందుకున్నారు.
సంక్రాంతి సెలవులు ముగిసినా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి వస్తున్నాంకు ఆక్యూపెన్సీ ఏమాత్రం తగ్గడం లేదు. సంక్రాంతి సినిమాలు తప్పించి బాక్సాఫీస్ వద్ద కొత్తగా ఏ చిత్రం లేకపోవడం వెంకటేష్ మూవీకి బాగా కలిసొస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణతో పాటు క్లాస్ సెంటర్స్‌లో రెస్పాన్స్ బాగుండటంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా రెండో వారం కూడా స్ట్రాంగ్ కలెక్షన్స్‌ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 9వ రోజు కూడా అన్ని సెంటర్స్‌లో ఎక్స్‌లెంట్ హోల్డ్ చూపించిన వెంకటేష్ సినిమా .. ప్రపంచవ్యాప్తంగా రూ. 6 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మరి లాంగ్ రన్‌లో వెంకీ మామ ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











