Sankranthiki Vasthunam Day 1 Collection : ఓపెనింగ్స్‌లో విక్టరీ కొట్టిన వెంకీ మామ .. ఎన్ని కోట్లంటే?
కామెడీ సినిమాల స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ సినిమాల హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పండగ సీజన్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్‌గా ట్రేడ్ పండితులు చెబుతున్న ఈ సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిందో చూస్తే:
తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతికి సినిమాల జాతర ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సొంతూరిలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, ఆత్మీయుల మధ్య పెద్ద పండుగ జరుపుకునేందుకు ప్రపంచంలో ఏ మూల ఉన్నా పల్లెబాట పడతారు జనం. అందుకు తగినట్లుగానే ఈ సీజన్‌లో వారికి వినోదాన్ని అందించడానికి సినీ జనాలు భారీ ఎత్తున సినిమాల రిలీజ్‌కు ప్లాన్ చేస్తుంటారు. తాజాగా ఈ సంక్రాంతికి కూడా భారీ సినిమాలు థియేటర్లలో దిగాయి.

జనవరి 10 రామ్ చరణ్ - శంకర్‌ల గేమ్ ఛేంజర్, జనవరి 12న నందమూరి బాలకృష్ణ - బాబీల డాకు మహారాజ్, ఆల్రెడీ థియేటర్‌లో ఉన్న అల్లు అర్జున్ పుష్ప 2, ఉపేంద్ర యూఐ, ఉన్ని ముకుందన్‌ల మార్కోలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇంతటి టఫ్ ఫైట్‌లో జనవరి 14న సరిగ్గా సంక్రాంతి నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది సంక్రాంతికి వస్తున్నాం . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇందులో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. నరేష్, సాయికుమార్, మురళీగౌడ్, వీటీఎస్ గణేష్, ఉపేంద్ర లిమాయే తదితరులు కీలకపాత్రలు పోషించారు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం భారీ తారాగణం, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. సుమారుగా 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది.
గోదారి గట్టు మీద రామ చిలక సహా బీమ్స్ అందించిన ఇతర పాటలు, టీజర్, ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు 1300 స్క్రీన్లలో సంక్రాంతికి వస్తున్నాం మూవీని రిలీజ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్‌తో పాటు తెల్లవారుజామున పడిన బెనిఫిట్ షోలకు మంచి రెస్పాన్స్ లభించింది. దాంతో రికార్డు కలెక్షన్లు నమోదవుతాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఇక ఈ మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. సంక్రాంతి కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూలు చేసింది. మన దగ్గర మొత్తం కలిపి 30 కోట్ల రూపాయలు .. ఇతర రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు, కర్ణాటక, నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా రూ.11 కోట్ల రూపాయలు రాబట్టింది. మొత్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ. 45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి వెంకటేష్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications











