Sankranthiki Vasthunam Box Office : రికార్డు కలెక్షన్స్‌తో వెంకటేష్ మాస్ జాతర.. ఎన్ని కోట్లంటే?
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి వారంలోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా రెండో వారాన్ని కూడా విజయవంతంగా ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 12వ రోజు వెంకటేష్ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే:
సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దాదాపు 85 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బరిలో దిగిన వెంకటేష్ చిత్రం మూడు రోజుల్లోనే లక్ష్యాన్ని కొట్టిపడేసింది. ఇప్పటికే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు రూ.100 కోట్లకు పైగా లాభాలను పంచిపెట్టింది సంక్రాంతికి వస్తున్నాం.
ఐదో రోజు రూ. 12.75 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. ఐదో రోజు అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల లిస్టులో సంక్రాంతికి వస్తున్నాం రెండో స్థానంలో నిలిచింది. ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఆర్ఆర్ఆర్ (రూ.16.63 కోట్లు) ఉండగా.. అల వైకుంఠపురంలో (రూ.11.43 కోట్లు), బాహుబలి (రూ.11.35 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.10.86 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ క్రమంలో సీడెడ్ ఏరియాలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు వెంకటేష్. కేవలం 11 రోజుల్లోనే జీఎస్టీతో కలిపి రూ.17.2 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించాడు.

11 రోజుల వరకు నైజాంలో రూ.31.92 కోట్లు, సీడెడ్‌లో రూ.14.89 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.16.57 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ.11.57 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 7.24 కోట్లు, గుంటూరులో రూ.9.07 కోట్లు, కృష్ణాలో రూ.8.21 కోట్లు, నెల్లూరులో రూ. 3.84 కోట్లు చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రూ. 103.31 కోట్ల షేర్ రాబట్టింది. కర్ణాటక + రెస్టాఫ్ ఇండియాలో రూ.7 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.15 కోట్లతో కలిపి మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 124.11 కోట్ల షేర్ .. రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే ఆల్ టైం బాక్సాఫీస్ రికార్డు నెలకొల్పింది.
ఇక 12వ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే శనివారం వీకెండ్ కావడంతో సాలీడ్ బుకింగ్స్ నమోదయ్యాయి. 12వ రోజు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ. 6.5 కోట్ల గ్రాస్ వసూళ్లతో దుమ్మురేపింది. ఈ క్రమంలో ఆదివారం కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని థియేటర్ల సంఖ్యను పెంచేందుకు నిర్మాతలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











