Sankranthiki Vasthunam Box Office : బాక్సాఫీస్ బెండు తీస్తోన్న వెంకటేష్ .. 7వ రోజు ఎన్ని కోట్లంటే?
అనిల్ రావిపూడి - విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయవంతంగా తొలి వారాన్ని పూర్తి చేసుకుంది. ఇప్పటికే వీరిద్దరి కలయిలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3లు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా సంక్రాంతికి వస్తున్నాంతో హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. వారం రోజులకే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా ఏడో రోజు ఎన్ని కోట్లు వసూళ్లు రాబట్టిందో చూస్తే :
ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాంతో తన కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఖాతాలో వేసుకున్నారు వెంకటేష్. ఇందులో వెంకీ మామ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించగా.. వీకే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయికుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను దాదాపు 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మించారు.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే .. దాదాపు 42 కోట్లుగా జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. దాదాపు 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ పండితులు విలువ కట్టారు. అయితే దీనిని మూడు రోజుల్లోనే కొట్టిపడేసిన సంక్రాంతికి వస్తున్నాం.. లాభాల పంట పండిస్తోంది.
ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపు 80 కోట్లకు పైగా లాభాలను పంచి పెట్టినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. . ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సంక్రాంతికి వస్తున్నాం మూవీ రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. వెంకటేష్ నటన, అనిల్ రావిపూడి టేకింగ్, కామెడీ, పాటలు అన్ని కలవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజు ఏకంగా రూ.45 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచింది.
ఇప్పటి వరకు సంక్రాంతి సెలవులు, వీకెండ్ కావడంతో దుమ్మరేపిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సోమవారం నుంచి అసలు పరీక్ష ఎదురైంది. ఆదివారంతో పోలిస్తే చాలా ఏరియాలో దాదాపు 50 శాతం వరకు బుకింగ్స్ డ్రాప్ అయ్యాయి. ఓవర్సీస్‌లోనూ పరిస్ధితి ఇలాగే ఉంది. అయితే ఫస్ట్ షో, సెకండ్ షోలకు బుకింగ్స్ ఫుల్ కావడంతో ఈ సినిమాకు సాలీడ్ వసూళ్లు వచ్చాయి.

ఏడో రోజు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాంకు రూ. 11 కోట్ల గ్రాస్ వసూళ్లు లభించాయి. తొలి వారంలోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాంగ్ రన్‌లో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందోనని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











