38 ఏళ్ల కెరీర్‌లో విక్టరీ వెంకటేష్ సంచలన రికార్డు.. బాహుబలి చరిత్రను తిరగరాసిన సంక్రాంతికి వస్తున్నాం
సంక్రాంతికి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేస్తున్నది. రిలీజ్‌కు ముందే హిట్ టాక్ సొంతం చేసుకొన్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత బాహుబలి సినిమా రికార్డులను కూడా తిరగరాస్తున్నది. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో వెంకటేష్ దగ్గుబాటి నటించిన ఈ చిత్రం రికార్డు విజయాన్ని అందుకొంటున్నది. మీనాక్షి చౌదరీ, ఐశ్వర్య రాజేశ్ తదితరులు నటించిన ఈ చిత్రం 13 రోజున కూడా ఓవర్సీస్‌లో అదే జోష్‌ను కొనసాగిస్తున్నది. నార్త్ అమెరికాలో ఈ సినిమా సృష్టిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాను రెమ్యునరేషన్లు, నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. సుమారుగా 42 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఈ మూవీపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని 1300 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

విక్టరీ వెంకటేష్ నటించిన బాక్సాఫీస్ టాప్ లేపేసే వసూళ్లను రాబట్టింది. తొలివారం ముగిసే సమయానికి ఏపీ, తెలంగాణలో 146 కోట్లు నికరంగా, కర్ణాటకలో 11 కోట్లు, తమిళనాడులో 1.7 కోట్లు, నార్త్, ఇతర రాష్ట్రాల్లో 3.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక 13వ రోజు ముగిసే సమయానికి తమిళనాడులో 12.5 కోట్లు, ఏపీ, నైజాంలో 156 కోట్లు, తమిళనాడులో 1.85 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 3.5 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.దాంతో ఈ సినిమా ఇండియాలో 175 కోట్లు నికరంగా 253 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది.
ఇదిలా ఉండగా, కేవలం దేశంలోనే కాకుండా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విదేశాల్లో కూడా భారీ వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో 2.7 మిలియన్ అమెరికన్ డాలర్లను వసూలు చేసిందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా వెల్లడించింది. వెంకటేష్ కెరీర్‌లోనే ఈ చిత్రం అమెరికాలో అత్యధిక వసూళ్లను రాబట్టింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా తాజాగా ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేసింది. ఎస్ఎస్ రాజమౌళి దర్వకత్వం వహించిన బాహుబలి సినిమా 13వ రోజున కేవలం 4.68 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. కానీ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మాత్రం ఆంధ్రా, నైజాంలో 6.77 కోట్లు వసూలు చేయడం ఓ ఘనతగా పేర్కొంటున్నారు. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 276 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రత్యేకమైన రికార్డును ఆయనకు అందించింది. వెంకీ ఇప్పటి వరకు 38 సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగానికి సేవలందిస్తూ.. సుమారుగా 76 సినిమాల్లో నటించారు. అయితే గతంలో నార్త్ అమెరికాలో విక్టరీకి భారీ వసూళ్లే లభించాయి. కానీ ఈ రేంజ్ (2.7 మిలియన్ డాలర్లు) రాబట్టడం ఇదే తొలిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే సీనియర్ హీరోలు నటించిన సినిమాల్లో ఈ చిత్రం అమెరికా, కెనడాలో 13వ స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











