Vidaa Muyarchi Advance Booking: విడాముయార్చి కలెక్షన్ల జోరు.. అజిత్ మూవీకి అడ్వాన్స్ బుకింగ్ సంచలనం!
గతేడాది ది గోట్, తంగలాన్, భారతీయుడు 2, కంగువా వంటి స్టార్ హీరోల సినిమాలు ఏమాత్రం అలరించకపోవడంతో తమిళ ప్రేక్షకులు నిరాశకు గురవుతున్నారు. 2024లో 241 సినిమాలు కోలీవుడ్ నుంచి వస్తే వాటిలో 223 సినిమాలు ఫ్లాప్ కావడంతో పాటు నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు ఏకంగా రూ.1000 కోట్లు నష్టాలను తెచ్చిపెట్టింది. దీంతో 2025పై కోలీవుడ్ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.
కొత్త సంవత్సరం మదగజరాజాతో గ్రాండ్‌గా ఓపెన్ చేసింది తమిళ చిత్ర పరిశ్రమ.. తాజాగా బాక్సాఫీస్‌పై దండెత్తడానికి వస్తున్నాడు తలా అజిత్ కుమార్. రెండేళ్ల క్రితం తునివు సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన నుంచి ఏడాదిన్నరగా ఎలాంటి సినిమా రాకపోవడంతో అభిమానులు మంచి ఆకలితో ఉన్నారు. ఈ క్రమంలో అజిత్ నటించిన విడాముయార్చి విడుదలకు సిద్ధమైంది.

తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుననారు. ఇందులో అజిత్ సరసన త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా అర్జున్ , రెజినా, రమ్య సుబ్రహ్మణ్యం, నిఖిల్ నాయర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తెలుగులో పట్టుదలగా రానుంది.
విడాముయార్చికి సంబంధించిన స్టిల్స్, పోస్టర్స్ బయటికొచ్చినప్పుడే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పొంగల్ కానుకగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. ఇంటర్నెట్‌ను ఇది షేక్ చేసింది. అనిరుద్ రవిచందర్ అందించిన మ్యూజిక్, బీజీఎం ఈ అంచనాలను మరింత పెంచేసింది. తమిళనాట అజిత్ సినిమా విడుదల అంటే పండగ వాతావరణం నెలకొంటుంది. అలాంటిది లాంగ్ గ్యాప్ తర్వాత అజిత్ సినిమా వస్తుండటంతో ఆయన అభిమానులు ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో తాజాగా విడాముయార్చి అడ్వాన్స్ బుకింగ్‌ను మేకర్స్ ఓపెన్ చేశారు. బుకింగ్ గురించి ఎలాంటి హడావుడి , ముందస్తు సమాచారం లేకపోవడం.. సడెన్‌గా బుక్ మై షోలో విడాముయార్చి బుకింగ్స్ ఓపెన్ కావడంతో అజిత్ అభిమానులు పోటెత్తారు. గంటకు 15 వేలకు పైగా టికెట్స్ బుకింగ్స్‌తో బుక్ మై షోలో తుఫాన్ కొనసాగుతోంది. విడాముయార్చి టికెట్స్ కోసం అభిమానులు ఎగబడటంతో బెంగళూరులోని ప్రఖ్యాత విక్టరీ సినిమాస్ బుకింగ్ సైట్ క్రాష్ అయ్యింది.

కొన్ని ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే విడాముయార్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తమిళనాడులో అప్పుడే కోటి రూపాయల మార్క్ దాటేసింది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 476 షోలకు గాను రూ.1.76 కోట్ల వసూళ్లు వచ్చాయి. మరోవైపు యూఏఈలో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కింద 264 షోలకు గాను 2309 టికెట్లు అమ్ముడై 33 వేల డాలర్లు ( భారత కరెన్సీలో రూ.28,60,814) వచ్చాయి. ఇకపోతే.. 24 గంటల్లో బుక్ మై షోలో అత్యధిక టికెట్స్ బుక్ అయిన సినిమాలలో జైలర్ 60 వేలు టాప్ ప్లేస్‌లో ఉండగా.. విడాముయార్చి కేవలం 12 గంటల్లోనే 45 వేల టికెట్ బుకింగ్స్‌తో రజనీ రికార్డ్‌కు చేరువైంది. విడుదలకు ముందే పరిస్ధితి ఇలా ఉంటే విడాముయార్చి రిలీజ్ తర్వాత అజిత్ ఇంకెన్ని రికార్డులు బద్ధలు కొడతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











