Bichagadu 2 Collections: కొత్త చరిత్రకు అడుగు దూరంలో.. తెలుగులో భారీగానే.. కోట్ల లాభాలతో రికార్డు
చాలా భాషల కంటే తమిళంలో రూపొందిన చిత్రాలే ఎక్కువగా తెలుగులోకి డబ్బింగ్ అవుతూ ఉంటాయి. అలా కొన్నేళ్ల క్రితం వచ్చి సెన్సేషనల్ హిట్‌ను సొంతం చేసుకున్న సినిమానే 'బిచ్చగాడు'. అప్పట్లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీకి కొనసాగింపుగా ఇప్పుడు 'బిచ్చగాడు 2' వచ్చింది.
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగులో అత్యధిక వసూళ్లతో వారంలోనే సూపర్ హిట్ అవగా.. తమిళంలో విజయానికి చేరువగా వచ్చింది. ఈ నేపథ్యంలో 'బిచ్చగాడు 2' మూవీ 12 రోజుల కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం పదండి!

'బిచ్చగాడు' ఈ సారి కొత్తగా: కోలీవుడ్ సెన్సేషన్ విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో రూపొందిన 'బిచ్చగాడు 2'. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్‌గా నటించగా.. రాధా రవి, మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే మ్యూజిక్ కూడా ఇచ్చాడు. హిట్ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దీన్ని ఫాతిమా విజయ్ ఆంటోనీ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

బిచ్చగాడు 2 బిజినెస్ వివరాలు: గతంలో సంచలన విజయాన్ని అందుకున్న మూవీకి సీక్వెల్ కావడంతో 'బిచ్చగాడు 2'పై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో ఇది రూ. 6.00 కోట్లు మేర బిజినెస్‌ను చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు, లొకేషన్లలో కలిపి రూ. 15 కోట్లు బిజినెస్ చేసింది.

12వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?: విజయ్ ఆంటోనీ - కావ్య తాపర్ కాంబినేషన్‌లో వచ్చిన 'బిచ్చగాడు 2' మూవీకి తెలుగులో ఆరంభం నుంచే వసూళ్లు బాగా వస్తున్నాయి. దీంతో ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంది. మధ్యలో తగ్గినా రెండో వీకెండ్‌లో మళ్లీ పుంజుకుంది. ఇక, 11వ రోజు ఈ చిత్రం రూ. 21 లక్షలు రాబట్టింది. అయితే, 12వ రోజు మాత్రం కాస్తే డౌన్ అయి రూ. 20 లక్షలు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది.

12 రోజులకూ కలిపి ఎంతొచ్చింది: 12 రోజుల్లో 'బిచ్చగాడు 2'కి తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 2.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.34 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.29 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 72 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 51 లక్షలు, గుంటూరులో రూ. 72 లక్షలు, కృష్ణాలో రూ. 72 లక్షలు, నెల్లూరులో రూ. 43 లక్షలతో కలిపి.. రూ. 8.66 కోట్లు షేర్, రూ. 15.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది: ఆంధ్రా, తెలంగాణలో రూ. 15.45 కోట్లు గ్రాస్ రాబట్టిన 'బిచ్చగాడు 2'.. ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే రాబట్టింది. దీంతో తమిళనాడులో రూ. 14.35 కోట్లు గ్రాస్, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.11 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లో రూ. 15.95 కోట్లు షేర్, రూ. 32.15 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

టార్గెట్ ఎంత? లాభం ఎంత?: 'బిచ్చగాడు 2' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.00 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.00 కోట్లుగా నమోదైంది. ఇక, 12 రోజుల్లో దీనికి రూ. 15.95 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 5 లక్షలు రాబడితేనే ఈ మూవీ హిట్ అవుతుంది. తెలుగులో రూ. 6.50 కోట్లు టార్గెట్‌కు రూ. 8.66 కోట్లు వచ్చాయి. అంటే ఇంకా రూ. 2.16 కోట్లు లాభం వచ్చింది.
ఇక్కడ రికార్డు.. అక్కడ చేరువ: విజయ్ ఆంటోనీ హీరోగా నటించి, తెరకెక్కించిన 'బిచ్చగాడు 2' మూవీ ఓవరాల్‌గా విజయాన్ని అందుకోవడానికి కూడా చేరువగా వచ్చింది. ఇంకా ఈ చిత్రం రూ. 5 లక్షలు రాబడితే టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్‌గా ఘనతను అందుకుంటుంది. అలాగే, తెలుగులో ఈ సినిమా రూ. 2 కోట్లు లాభాల మార్కును కూడా చేరుకుని మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకుంది.


Click it and Unblock the Notifications











