100 పర్సెంట్ బ్లాక్ బస్టర్.. మనం కొట్టినం.. కింగ్డమ్ రిజల్ట్‌పై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన చిత్రం కింగ్డమ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. జూలై 31న కింగ్డమ్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించింది. నిర్మాత నాగవంశీ, హీరో విజయ్ దేవరకొండ, నటుడు సత్యదేవ్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరిలు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
యూఎస్ ప్రీమియర్స్‌తో చిల్
'లోపల చాలా ఫీల్ అవుతున్నా దానిని ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాల టైంలో రిలీజ్ ముందు రోజు రాత్రి నా ఇంట్లో ఫ్రెండ్స్ అంతా చిల్ అయ్యేవాళ్లం. తర్వాతి రోజు మార్నింగ్ సినిమా రిజల్ట్ వచ్చేది. మళ్లీ ఈసారి అందరూ కాల్ చేసి ఇంట్లో కూర్చొని చిల్ కావాలని అడిగారు. నిన్న రాత్రి నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూర్చొన్నారు. 10.30కి అమెరికాలో షోలు పడ్డాయి. యూఎస్ ప్రీమియర్స్ నెంబర్లతో స్టార్ట్ అయి, యూఎస్ ఆడియన్స్ రివ్యూలు, ఫోన్ కాల్స్ వచ్చాయి' అని విజయ్ దేవరకొండ తెలిపారు.

అమ్మ ఏడిస్తే తట్టుకోలేను
'మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఎంత మంది, ఎన్నిసార్లు నన్ను ఎమోషనల్ చేయడానికి ట్రై చేశారో చెప్పలేను. పొద్దున్నే థియేటర్ల నుంచి ఏడుస్తూ కాల్ చేసి అన్నా మనం కొట్టినం అని చెప్పారు. నా మేనేజర్ అనురాగ్ అయితే ఏడ్చేస్తున్నాడు. మా అమ్మ ఇంటికి వచ్చేసరికి అందరం రూంలలోకి వెళ్లిపోతున్నాం. మమ్మీ ఏడిస్తే అందరం ఏడుస్తాం. ఇక ఏడుపులు మా వల్ల కాదు అనుకున్నాం' అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు.
వెంకన్న సామీ ఆశీస్సుల వల్లే
'ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్, నాకు ఊరట దక్కింది.. చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ వల్లనే ఇదంతా.. మీ మీడియా అంతా నా వెనుక ఎంత ఉన్నారో.. నేను చూశా. తెలుగు ప్రజలు నా వెనుక ఎంత ఉన్నారో నిన్నటి నుంచి చూస్తున్నా. ఫ్యాన్స్ అంతా సినిమా గురించి ఎంత మొక్కుకున్నారో.. ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా. ఇదంతా ఆ వెంకన్న సామీ ఆశీస్సులు, మీ ప్రేమ.. యూఎస్‌కి చాలా పెద్ద థ్యాంక్స్. ఆగస్టులో వస్తున్నా. నా టీమ్‌తో కలిసి ఆంధ్రా ప్రజలను కలుస్తా. రాజమండ్రి, విజయవాడ, వైజాగ్ అంతా వెంకటేష్‌ని, సత్యని కలవాలి' అని విజయ్ దేవరకొండ చెప్పారు.
నన్ను థియేటర్‌కి వెళ్లనివ్వడం లేదు
'వంశీగారు గురువారం రిలీజ్ అనగానే టెన్షన్ పడ్డా.. శుక్రవారం రిలీజ్ అంటేనే నాకు చాలా భయమని థియేటర్లు నిండుతాయో, లేదోనని. మీరు గురువారం రిలీజ్ పెడతారంటే.. నన్ను నమ్మాలని, సినిమా బాగుంటే జనాలు వస్తారని, సినిమా గురించి వెయిట్ చేస్తున్నారని వంశీ గారు అనడం మీరు నిజంగానే రావడం సంతోషంగా ఉంది. నేనే ఇంకా సినిమా చూడలేదు.. మీరంతా చూశాక రేపో, ఎల్లుండో నేను కూడా చూస్తా. సినిమాను చూడనివ్వడం లేదు.. థియేటర్‌కి వెళ్లాలంటే పర్మిషన్ కావాలని భయపెడుతున్నారు. అయినా ట్రై చేస్తా.. మీ అందరితో కలిసి సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని ఉంది. తెలుగు ప్రజలకు, తెలుగు ప్రేక్షకులకు మరోసారి ధన్యవాదాలు' అని విజయ్ దేవరకొండ వెల్లడించారు.
100% కొట్టినం
'మీరు ఇంత ప్రేమిస్తున్నారంటే నా వల్ల అయితే సాధ్యం కాదు. గౌతమ్, అనిరుధ్, నవీన్ నూలి, సత్య, వెంకటేష్, వంశీగారు, తెలుగు సినిమా ఆడియన్స్ నా వెనక నిలబడకపోతే నాకు సాధ్యం కాదు. ఇలా ప్రేక్షకులు రావడానికి సినిమా మీద ప్రేమ తప్పించి మరొకటి కాదు. 100 పర్సెంట్ మనం కొట్టినం.. ఇది విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కాదు.. విజయ్ దేవరకొండ కమ్ బ్యాక్ కాదు .. ఇది 100 పర్సెంట్ మన బ్లాక్ బస్టర్.. మనం కొట్టినం' అని విజయ్ దేవరకొండ తన ప్రసంగాన్ని ముగించారు.


Click it and Unblock the Notifications











