'విశ్వరూపం' ఎంత కలెక్టు చేసింది?
చెన్నై : ఎన్నో వివాదాలు మూట కట్టుకుని విడుదలైన కమల్‌హాసన్ తాజా సినిమా వసూళ్లపరంగానూ 'విశ్వరూపం' ప్రదర్శిస్తోంది. కమల్‌హాసన్ హాలీవుడ్ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించారని ప్రముఖ నటులు, దర్శకులు ప్రశంసిస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. రూ.95 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రూ.120 కోట్లకు పైగా వసూలు చేసిందట. ఈ విషయమై 'విశ్వరూపం'లో ప్రతినాయక పాత్ర పోషించిన రాహుల్‌బోస్ ట్విట్టర్‌లో స్పందించారు. 'విశ్వరూపం' రూ.120 కోట్లు వసూలు చేసిందనే విషయం ఇప్పుడే తెలిసింది. చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమా రూ.100 కోట్లు వసూలు చేసిన చిత్రాల జాబితాలో స్థానాన్ని సంపాదించుకోవడం ఎప్పటికీ మరిచిపోలేని అంశం. చిత్రబృందానికి, కమల్‌కు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.
విశ్వరూపం చిత్రం వలన అనేక ఆందోళనలు చెలరేగడం, సినిమాపై బ్యాన్ కారణంగా తమిళనాడులో ఈ చిత్రం నిలిచి పోవడం, కమల్ హాసన్ తీవ్రంగా నష్ట పోవడం తెలిసిందే. కమల్ హాసన్ తన సినిమాలో ఎవరినీ కించ పరచక పోయినా, ఏ మతం మనోభావాలు దెబ్బతీయక పోయినా..... రాజకీయాల కారణంగా ఈ సినిమా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. తాను ఏ తప్పూ చేయలేదని, తాను ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని మొదటి నుంచి నిజాయితీగా వాదిస్తూ వస్తున్న కమల్ హాసన్... మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు.
విశ్వరూపం చిత్రానికి త్వరలో సీక్వెల్ కూడా రాబోంతోందని స్పష్టం చేసారు. ఈ చిత్రానికి 'విశ్వరూపం-2 ఇండియా' అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలిపారు. 'మూ' అనేది వేరే సినిమాకు పెట్టబోయే టైటిల్ అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. విశ్వరూపం చిత్రం తెలుగునాట విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.


Click it and Unblock the Notifications











