పేట vs విశ్వాసం: రజనీకాంత్-అజిత్ ఇద్దరిలో ఫస్ట్ డే బాక్సాఫీస్ విన్నర్ ఎవరు?
తెలుగులో ఈ సంక్రాంతికి ఎన్టీఆర్-కథానాయకుడు, వినయ విధేయ రామ, ఎఫ్ 2 చిత్రాలు ఒకటి రెండు రోజుల గ్యాపుతో విడుదలై బాక్సాఫీసు వద్ద పోటీ పడుతుండగా... తమిళంలో రజనీకాంత్ నటించిన 'పేట', అజిత్ నటించిన 'విశ్వాసం' చిత్రాలు ఒకేరోజు(జనవరి 10)న పోటాపోటీగా రిలీజయ్యాయి.
ఇటు రజనీ సినిమాతో పాటు అటు అజిత్ సినిమాకు ఫస్ట్ డే టాక్ పాజిటివ్‌గా ఉండటంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో పై చేయి ఎవరిది అవుతుంది? అనేది తమిళ ట్రేడ్ వర్గాలు, అభిమానుల్లో చర్చనీయాంశం అయింది.

రెండు సినిమాలకు థియేటర్లు తగ్గాయి
అజిత్ నటించిన విశ్వాసం చిత్రం తమిళనాడులో దాదాపు 525 థియేటర్లలో విడుదలైంది. చెన్నై సిటీలోనే తొలి రోజు 150 షోలు పడ్డాయి. ఇదే రోజు ‘పేట' విడుదల కావడంతో రెండు సినిమాలకు థియేటర్ల సంఖ్య తగ్గింది.

విశ్వాసం తొలిరోజు అంచనాలు
‘విశ్వాసం' చిత్రం తొలి రోజు రూ. 16 కోట్ల నుంచి 18 కోట్ల గ్రాస్ వసూలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఫస్ట్ డే కలెక్షన్స్‌కు సంబంధించి అఫీషియల్ నెంబర్స్ వెల్లడికావాల్సి ఉంది.

‘పేట' తొలిరోజు ఎంత రాబట్టింది?
‘పేట' చిత్రం తొలి రోజు రూ. 16 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది. చెన్నై సిటీలో 1.12 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. విశ్వాసం చిత్రం చెన్నైలో తొలి రోజు రూ. 88 లక్షల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది.

‘పేట' ఆధిపత్యం...
తమిళనాడులో పేట, విశ్వాసం బాక్సాఫీసు వద్ద దాదాపుగా సమాన స్తాయిలో దూసుకెళుతున్నా... తమిళనాడు బయట మాత్రం ‘పేట' ఆధిపత్యం కనిపిస్తోంది. కర్నాటకతో పాటు యూఎస్ఏ, గల్ఫ్ దేశాల్లో రజనీకాంత్ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తున్నట్లు టాక్.

యూఎస్ఏలో రజనీకాంత్ పైచేయి
యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ‘పేట' ప్రీమియర్ షోలు, ఫస్ట్ డే కలెక్షన్ కలిపి దాదాపు 7 లక్షల డాలర్లు వసూలవ్వగా.... ‘విశ్వాసం' కేవలం 84 వేల డాలర్లు మాత్రమే రాబట్టింది. ఈ ఇద్దరిలో సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది కొన్ని రోజుల్లో తేలనుంది.


Click it and Unblock the Notifications











