Vrusshabha Box Office Closing Collections: వృషభ క్లోజింగ్ కలెక్షన్లు.. మోహన్‌లాల్ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం వృషభ. భారతీయ సినీరంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థ బాలాజీ టెలి ఫిల్మ్స్ బ్యానర్‌తోపాటు కనెక్ట్ మీడియా, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి శోభాకపూర్, ఏక్తా కపూర్, పద్మకుమార్, వరుణ్ మాథుర్, అభిషేక్ ఎస్ వ్యాస్ తదితరులు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో మోహన్‌లాల్ ద్విపాత్రాభినయం చేయగా.. సమర్జీత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, వినయ్ వర్మ, ఆలీ, అయ్యప్ప పీ శర్మ తదితరులు నటించారు. లెజెండరీ హీరో జితేంద్ర అతిథి పాత్రలో మెరిసారు. ఈ చిత్రానికి ఆంటోని శ్యామ్సన్, కేఎం ప్రకాశ్ ఎడిటింగ్, సామ్ సీఎస్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? సాధిస్తున్న కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..

పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ నేపథ్యంగా యాక్షన్, థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. మోహన్‌లాల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లతో కలిపి సుమారుగా 200 కోట్ల రూపాయలతో రూపొందించారు. ఈ సినిమాను మలయాళంలో ఆశీర్వాద్ సినిమాస్, తెలుగులో గీతా ఆర్ట్స్, హిందీలో పెన్ మూవీస్, కన్నడలో కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థలు డిస్ట్రిబ్యూట్ చేశాయి. అయితే ఈ సినిమా నాసిరకమైన కంటెంట్, కథ, కథనాలు పేలవంగా ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. దాంతో తొలి ఆట నుంచే భారీగా బోల్తా కొట్టింది.
మోహన్ లాల్ కెరీర్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా మలయాళంలో అతి దారుణంగా కలెక్షన్లను నమోదు అయ్యాయి. తొలి రోజు 47 లక్షల రూపాయలు, రెండో రోజు 20 లక్షల రూపాయలు, మూడో రోజు 15 లక్షలు, 4వ రోజు 10 లక్షలు, 5వ రోజు 9 లక్షల రూపాయలు, ఆరో రోజు 6 లక్షల రూపాయలు, 7 రోజు 3 లక్షల రూపాయయలు వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా వారం రోజుల్లో 1.1 కోట్ల రూపాయలను రాబట్టింది.
తెలుగులో ఈ సినిమా పేలవమైన కలెక్షన్లు నమోదు అయ్యాయి. తొలి రోజు 10 లక్షలు, రెండో రోజు 10 లక్షలు, మూడో రోజు 5 లక్షలు, నాలుగు రోజు 1 లక్ష, ఐదో రోజు 6 లక్షలు, ఆరో రోజు 1 లక్ష రూపాయలు, ఏడో రోజు 5 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో మొత్తంగా 38 లక్షలు రాబట్టింది. హిందీ, కన్నడ భాషల్లో కూడా బాక్సాఫీస్ దారుణమైన పరిస్థితులు కనిపించాయి. ఈ సినిమా కన్నడలో వారం రోజుల్లో మొత్తంగా 6 లక్షల రూపాయలు, హిందీలో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది.
వృషభ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం 1.64 కోట్ల రూపాయల నెట్, 1.91 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 25 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 2.16 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిక్ వెల్లడించింది. మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్ నటించిన ఈ సినిమాకు నష్టాలు ఊహించని రీతిలో రావడం భారతీయ సినిమా పరిశ్రమను నివ్వెరపోయేలా చేసింది.


Click it and Unblock the Notifications











