Writer Padmabhushan Closing Collections చిన్న సినిమా భారీ విజయం.. ఎన్ని కోట్ల లాభమంటే?
చిన్న సినిమా ఊహించని విజయం సాధిస్తే.. ఇండస్ట్రీలో ఒకరకమైన ఊపు కనిపిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన రైటర్ పద్మభూషణ్ సినిమా అనూహ్య విజయం సాధించడంతో చిన్న చిత్రాల నిర్మాతలకు, దర్శకులకు ఓ భరోసా కనిపించింది. ఛాయ్ బిస్కట్, ఆదిత్య మ్యూజిక్ సంయుక్తంగా నిర్మించిన రైటర్ పద్మభూషణ్ తొలి రోజు నుంచే మంచి టాక్‌తో సినిమాకు తగినట్టుగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

సుహాస్ హీరోగా మదర్ సెంటిమెంట్‌తో
మదర్ సెంటిమెంట్‌తో వచ్చిన రైటర్ పద్మభూషణ్ చిత్రంలో సుహాస్, టీనా శిల్పరాజ్, రోహిణి, ఆశీష్ విద్యార్థి నటించారు. ఈ సినిమాకు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దాదాపు 3 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మౌత్ టాక్‌తో ప్రేక్షకులకు చేరువైంది.

400 స్క్రీన్లలో రిలీజ్
రైటర్ పద్మభూషణ్ సినిమా టీజర్లు, ట్రైలర్లు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను క్రియేట్ చేయడంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మౌత్ టాక్‌తో రెస్పాన్స్ బాగా రావడంతో కొన్ని చోట్ల స్క్రీన్లను పెంచడం జరిగింది.

గత రెండువారాల్లో
రైటర్ పద్మభూషణ్ రిలీజ్‌కు ముందు 27 ప్రీమియర్లు ప్రదర్శించడంతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయింది. దాంతో తొలి రోజు 1 కోటి రూపాయల వసూళ్లతో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. తొలివారాంతానికి 3 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. తొలివారం ముగిసే సమయానికి ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 4.54 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. ఇక రెండోవారంలో ఈ చిత్రం ముగిసే సమయానికి 7 కోట్ల మేర వసూళ్లను రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
ఇక రైటర్ పద్మభూషణ్ వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం 7.9 కోట్ల గ్రాస్, 7.35 కోట్ల షేర్ సాధించింది. ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయలను రాబట్టింది. దాంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజింగ్ సమయానికి 11 కోట్ల మేర వసూళ్లను సాధించింది. ఇటీవల కాలంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

రైటర్ పద్మభూషణ్ లాభం ఎంతంటే?
రైటర్ పద్మభూషణ్ లాభాల విషయానికి వస్తే.. ఈ సినిమా బడ్జెట్ ప్రమోషన్స్‌తో కలిపి మొత్తం 6 కోట్ల రూపాయలు అయినట్టు సమాచారం. ఈ సినిమా దాదాపు 11 కోట్ల వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు ఈ సినిమా కనీసం 3 కోట్ల మేర లాభాలను పంచినట్టు ట్రేడ్ వర్గాల వెల్లడించాయి. చిన్న చిత్రం ఈ రేంజ్ కలెక్షన్లు రాబటడం ట్రేడ్ వర్గాల్లోను జోష్ పెంచింది.


Click it and Unblock the Notifications











