అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు ' హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంతంటే
హైదరాబాద్ : అల్లరి నరేష్ తాజా చిత్రం యముడికి మొగుడు ఈ రోజు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ మంచి మొత్తానికే అమ్ముడుపోయాయి. ఈ రైట్స్ ని గోల్డ్ మైన్స్ కి చెందిన మనీష్ సొంతం చేసుకున్నారు. ఈ రైట్స్ నిమిత్తం ఇరవై మూడు లక్షలు చెల్లించారు. చిత్రం అక్కడ హిందీ ఛానెల్స్ లో నాన్ ప్రైమ్ టైమ్స్ లో వేస్తారని తెలిసింది. ఈ మధ్య కాలంతో తెలుగు చిత్రాల హిందీ డబ్బింగ్ రైట్స్ కు మంచి డిమాండ్ వచ్చింది.
కథ ప్రకారం అల్లరి నరేష్ ఓ అల్లరి నరేష్. ఆ అల్లరి కుర్రాడికి అన్నింట్లోనూ తొందరే. ఏం చేసినా చిరిగి చాటంత అయితేనేగానీ మనసు కుదుటపడదు. అయితే ఒకానొక సిట్యువేషన్ లో ఈ అల్లరి కుర్రాడు యమలోకం వెళ్తాడు. యమధర్మరాజు ఎలాంటి శిక్ష వేస్తాడో అని అందరూ భయం భయంగా వరుసలో నిలుచున్నారు. కానీ ఓ అల్లరి నరేష్ మాత్రం... యముడి కూతురిపై కన్నేశాడు. ఓ శుభముహూర్తాన అతను ప్రేమలోపడ్డాడు. తండ్రి చాటుగా ఉన్న యమపుత్రికను తదేకంగా చూస్తూ ప్రేమ మైకంలోకి దించేశాడు. భూలోకంలోని కుర్రాడికీ, యముడి గారాలపట్టికీ ప్రేమ బంధం ఎలా పడిందో తెర మీదే చూడాలి.
'అల్లరి'నరేష్ మాట్లాడుతూ...యమ లోకం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకొన్నాయి... మా చిత్రానికీ నేపథ్యం ఆ లోకమే. అయితే యముడితో ఓ యువకుడు ఆడిన ఆట ఏమిటనేది మా చిత్రంలో చూడాలి. అలాగే సత్తిబాబు దర్శకత్వంలో అంతకుముందు 'బెట్టింగ్ బంగార్రాజు' చేశాను. ఆ తర్వాత చాలా కథలు చెప్పాడు. చివరకు ఈ సోషియో ఫాంటసీ కథ నన్ను బాగా ఆకట్టుకుంది. యమలోకం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నా ఫేవరెట్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. 'అల్లుడా మజాకా' లోని 'అత్తో అత్తమ్మ కూతురో' పాటను ఇందులో రీమిక్స్ చేసాం. గంటన్నర సేపు గ్రాఫిక్స్ ఉంటాయి. రమ్యకృష్ణతో కలిసి నటించడం ఆనందంగా ఉంది అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''కథ ఈ చిత్రానికి ప్రధాన బలం. విభిన్నమైన గెటప్పుల్లో నరేష్ చేసే సందడి ఆకట్టుకుంటుంది. వినోదంతో పాటు పాటలు అలరిస్తాయి. గంటన్నర గ్రాఫిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు.


Click it and Unblock the Notifications











