Yashoda 1st Week Collections సమంత మూవీకి ఊహించని కలెక్షన్లు.. రెండోవారం ఓవర్సీస్‌లో సూపర్ స్ట్రాంగ్!
దక్షిణాదిలో అగ్ర నటి సమంత రుత్ ప్రభు నటించిన యశోద చిత్రం దిగ్విజయంగా రెండోవారంలోకి ప్రవేశించింది. తెలుగు రాష్ట్రాల్లో గత 7 రోజులుగా సానుకూలమైన ఫలితాన్ని ఈ చిత్రం అందించింది. అయితే తెలుగు రాష్ట్రాలకు భిన్నంగా ఓవర్సీస్‌లో యశోద చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఈ సినిమా గత 7 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఓవర్సీస్‌లో స్రీన్ల సంఖ్య పెంపు
ఓవర్సీస్‌లో యశోద చిత్రానికి ప్రేక్షకులు, సమంత అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తొలివారంలో ఊహించని కలెక్షన్లు రావడంతోపాటు రెండో రోజునే ఈ సినిమా లాభాల్లోకి ప్రవేశించింది. అంతేకాకుండా ఈ చిత్రం రెండో వారంలో అమెరికాలో 14 స్క్రీన్లను పెంచడం ఈ సినిమాకు ఉన్న డిమాండ్‌ను తెలియజెప్పింది. అలాగే మలేషియాలో కూడా భారీగా వసూళ్లను సాధిస్తున్నది.

యూఎస్ బాక్సాఫీస్ వద్ద
యూఎస్ బాక్సాఫీస్ వద్ధ తొలి వారం సుమారు 550K డాలర్లను వసూలు చేసింది. దాదాపు ఈ సినిమా రెండో వారంలో కూడా 170 స్క్రీన్ల వరకు ప్రదర్శించబడుతున్నది. దాంతో యశోద చిత్రం రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం రెండోవారం ముగిసే సమయానికి 700k డాలర్లు సులభంగా సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజున
తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల విషయానికి వస్తే.. 7వ రోజున యశోద చిత్రం ఓ మోస్తారు వసూళ్లను రాబట్టింది. నైజాంలో 10 లక్షలు, సీడెడ్‌లో 3 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 1 లక్ష, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 లక్ష, గుంటూరు జిల్లాలో 1 లక్ష, కృష్ణా జిల్లాలో 2 లక్షలు నెల్లూరు జిల్లాలో 1 లక్ష రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 23 లక్షల షేర్, 40 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

వారం రోజుల్లో నైజాం, ఆంధ్రాలో
యశోద చిత్రం గత వారం రోజుల్లో నైజాం, ఆంధ్రాలో సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో 3.4 కోట్లు, సీడెడ్‌లో 61 లక్షలు, ఉత్తరాంధ్రలో 80 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 39 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 24 లక్షలు, గుంటూరులో 43 లక్షలు, కృష్ణా జిల్లాలో 46 లక్షలు, నెల్లూరులో 20 లక్షలు వసూలు చేసింది. దాంతో గత ఏడు రోజుల్లో 6.53 కోట్లు, 11.50 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా యశోద కలెక్షన్లు
ఇక ప్రపంచవ్యాప్తంగా యశోద కలెక్షన్లను పరిశీలిస్తే.. తెలుగు 11.45 కోట్లు, తమిళంలో 1.76 కోట్లు, హిందీలో 70 లక్షలు, మలయాళంలో 10 లక్షలు, ఓవర్సీస్‌లో 4.5 కోట్లు వసూలు చేసింది. దీంతో 18.5 కోట్ల షేర్, 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. రెండోవారంలో కూడా భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











