Celebs » Jagapati Babu » Biography
బయోగ్రఫీ
జగపతి బాబు తెలుగు సిని నటుడు జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ ఫై ఆణిముత్యాలను అందించిన దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ రంగప్రవేశం చేశాడు. జగపతి బాబు విజయవాడలో పుట్టి మద్రాస్ లో పెరిగారు. మద్రాస్ లోనే చదువు పూర్తిచేసిన జగపతిబాబు సినిమాల్లోకి రావటం తమాషాగా జరిగింది. 

చదువు అయ్యాక వైజాగ్ లో ఉన్న బిజినెస్ చూసుకుంటున్న జగపతికి ఎందుకు అనిపించిందో కానీ ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్ళాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకుని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. నాన్నగారు పెద్ద నిర్మాత అయినా ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించాడు. కో-డైరెక్టర్ ద్వార విషయం తెల్సుకున్న రాజేంద్రప్రసాద్ గారు జగపతి బాబు ఇష్టాన్ని మన్నించి 1989 లో 'సింహస్వప్నం' సినిమా తీసి తెలుగు తెరకు పరిచయం చేసారు. తోలి సినిమాలోనే డబుల్ రోల్ లో చేయడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తరవాత చేసిన చాలాచిత్రాలు ప్లాపులుగానే నిలిచాయి కానీ పట్టుదలతో  ప్రయత్నించిన జగపతిబాబుకు జగన్నాటకం, పెద్దరికం వంటి చిత్రాల సక్సెస్ తో నటుడిగా గుర్తింపు వచ్చింది. పెద్దరికం సినిమాతో రాంగోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి 'గాయం' హిట్ తో హీరోగా స్థిరపడ్డాడు. తొలిసారి గాయంలో డబ్బింగ్ చెప్పిన జగపతి వాయిస్ కి జనం దాసోహం అయ్యారు. 

1994 లో యస్.వి.కృష్ణరెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'శుభలగ్నం' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఇక అక్కడినుండి హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా దాదాపు 80 చిత్రాలలో పనిచేసాడు. వచ్చిన ఏ పాత్రనైనా సమర్ధవంతంగా పోషించగల నటుడిగా పేరుతెచ్చుకున్న జగపతిబాబు మహిళా ప్రేక్షకులను అధికంగా సంపాయించుకున్నారు. అలా అని ఏఒక్క రంగానికో పరిమితం కాకుండా ప్రయోగాలను చేస్తూ వచ్చాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'అంతఃపురం' సినిమాలో చేసిన సారాయి వీరాజు  పాత్రలో జీవించి ప్రేక్షకులను మైమరపించారు. ఆ తరవాత సముద్రం, మనోహరం వంటి చిత్రాలతో ప్రయోగాలకు చిరునామాగా మారాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే తెలుగు సినిమాకు సంబంధించి ఏ విధమైన ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా కేవలం ప్రేక్షకుల అభిమానంతోనే చాలాకాలం నుండి హీరోగా కొనసాగుతున్నాడు జగపతి బాబు. పాత్ర ఎటువంటిదైనా తనదైన నటనతో రక్తికట్టించగల నటుడిగా ముద్రవేయించుకున్న జగపతిబాబు ఆవకాశాలను సృష్టించుకోవడంలో నేటి యువతరం హీరోలతో పోటిపడుతున్నారు.