షాకింగ్: అసిస్టెంట్ డైరెక్టర్ రెమ్యూనరేష్ రూ. కోటి
హైదరాబాద్: సినిమా రంగంలో రెమ్యూనరేషన్ల విషయం ఎప్పుడూ హాట్ టాపిక్కే. సాధారణంగా హీరోలు, ఆ తర్వాత దర్శకులు, వారి తర్వాత హీరోయిన్లు అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ వార్తల్లో వ్యక్తులుగా మారుతూ ఉంటారు. సినిమాలో వీరే ప్రధానం కాబట్టి వారి రెమ్యూనరేషన్ కోట్లలో ఉండటం సహజమే.
అయితే ఈ మధ్య కాలంలో హీరోలతో సమానంగా, కొన్ని సినిమాల్లో హీరోల కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ హాట్ టాపిక్ అవుతున్నారు కొందరు దర్శకులు. తెలుగు సినిమా పరిశ్రమలో రాజమౌళి అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుడిగా వార్తలో ఉన్నాడు. బాహుబలి సినిమాకు రాజమౌళి అండ్ టీం రూ. 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.
ఇతర స్టార్ డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, బయపాటి శ్రీను, శ్రీను వైట్ల, వివి వినాయక్, పూరి జగన్నాథ్ రెమ్యూనరేషన్లు కూడా రోట్లలోనే ఉన్నాయి. దర్శకులకు ఈ రేంజిలో రెమ్యూనరేషన్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సినిమాలు భారీ విజయం సాధించడం వెనక, అత్యధిక వసూళ్లు సాధించడం వెనక వీరిదే ప్రధాన పాత్ర.

అయితే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ రూ. 1 కోటి ఉండటం ఎప్పుడైనా విన్నారా? తాజాగా ఈ విషయంలో దర్శకుడు సాయి కిషోర్ పేరు వార్తలో వినిపిస్తోంది. ఇప్పటి వరకు పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేసిన సాయి కిషోర్ అల్లరి నరేష్ జేమ్స్ బాండ్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఇటీవలే ఈచిత్రానికి సంబంధించిన ఆడియో కూడా విడుదలైంది. ఈ సందర్భంగా మరో దర్శకుడు వీరు పోట్ల..సాయి కిషోర్ రెమ్యూనరేషన్ గురించి ఓ ఆసక్తికర విషయం చెప్పుకొచ్చారు. అసిస్టెంట్ డైరెక్టరుగా సాయి కిషోర్ రూ. కోటి రెమ్యూనరేషన్ తీసుకునే విషయాన్ని బయట పెట్టారు. ఇంతకు ముందు సాయి కిషోర్ శ్రీను వైట్లతో పాటు పలువురు దర్శకుల వద్ద అసిస్టెంటుగా పని చేసారు. మరి జేమ్స్ బాండ్ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్న సాయి కిషోర్ సత్తా ఏమిటో ఈ సినిమా విడుదలైతేగానీ తెలియదు.


Click it and Unblock the Notifications











