రాజకీయాల్లోకి సినీనటి మీనా.. ఆ నేతతో సీక్రెట్ మీటింగ్? ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి?
భారతదేశంలో రాజకీయాలకు, సినిమాలకు ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్ధాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. పార్టీల మద్ధతుదారులుగా, సానుభూతిపరులుగా ఎంతోమంది ఉన్నారు. పార్టీల అభ్యర్ధుల తరపున ప్రచారం చేయడంతో పాటు స్వయంగా అభ్యర్ధులుగా పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న స్టార్ ఎందరో. మరికొందరైతే ఏకంగా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రులు కూడా అయిపోయారు. తాజాగా దక్షిణాదికి చెందిన స్టార్ హీరోయిన్ మీనా కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందనే టాక్ వినిపిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..
బాలనటి నుంచి హీరోయిన్‌గా
దక్షిణాదిని తన అందం, నటనతో ఒక ఊపారు మీనా. నాలుగు దశాబ్ధాల కెరీర్‌లో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన మీనా ఆ తర్వాత హీరోయిన్‌గా స్టార్‌డమ్ సంపాదించింది. దక్షిణాదిలోని అందరు అగ్రనటులతోనూ నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే బెంగళూరుకు చెందిన విద్యాసార్ అనే వ్యక్తిని పెళ్లాడగా, ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. పెళ్లి, కుటుంబ బాధ్యతలతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న మీనా అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తన వయసు, ఇమేజ్‌కు తగ్గ కథలతో రీ ఎంట్రీలోనూ దుమ్ముదులుపుతోంది మీనా.

భర్త మరణంతో డిప్రెషన్‌లోకి
కూతురు నైనికను కూడా బాలనటిగా పరిచయం చేశారు. కోలీవుడ్ సూపర్‌స్టార్, ఇళయ దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీలో ఆయనకు కుమార్తెగా నైనికగా నటించింది. అంతా సజావుగా సాగుతున్న దశలో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో 2022 జూన్ 28న కన్నుమూశారు. మీనా భర్త మరణ వార్త ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. భర్తను కోల్పోయిన మీనాకు సినీ పరిశ్రమగా అండగా నిలిచింది. భర్త మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన మీనా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. పలు సినిమాల్లో కీలకపాత్రలతో పాటు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీ అయ్యారు. ప్రస్తుతం తమిళంలో మూకుతి అమ్మన్ 2, రౌడీ బేబీ సినిమాలలో మీనా నటిస్తున్నారు.
ధనుష్‌తో మీనా డేటింగ్?
మీనా రెండో పెళ్లి చేసుకుంటారని.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌తో ఆమె రిలేషన్‌లో ఉన్నారని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ మీనా వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వచ్చారు. ప్రస్తుతానికి తనకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని కూతురు నైనిక భవిష్యత్తే ముఖ్యమని తెలిపారు. ఇలాంటి పరిస్ధితుల్లో మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా సినీ తారల పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. దీనికి తోడు తమిళనాడులో సినిమాలు, రాజకీయాలది ఫెవికాల్ బంధం. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారు సినిమా పరిశ్రమ నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టి సత్తా చాటారు.
ఉప రాష్ట్రపతితో మీనా భేటీ?
విజయ్ కాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్‌లు కూడా సొంతంగా పార్టీలు పెట్టినవారే. ప్రస్తుతం వారి బాటలోనే నడుస్తున్నారు దళపతి విజయ్. తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని స్థాపించి 2026 తమిళనాడు ఎన్నికల్లో బరిలో దిగనున్నారు. ఎన్నికల నాటికి తమిళ సినీ పరిశ్రమకు చెందిన కొందరు స్టార్స్ ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బరిలో దిగే అవకాశాలు లేకపోలేదు. తాజాగా తమిళనాడులో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న మీనా కూడా రాజకీయాల్లో అడుగుపెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వెళ్లిన ఆమె ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ పార్టీ అభ్యర్ధిగా మీనా?
తమిళనాడు ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని భావిస్తోన్న బీజేపీ సినీ సెలబ్రెటీలను తనవైపు తిప్పుకుని ఓట్లు రాబట్టాలని పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా మీనాను పార్టీలో చేరుకుని టికెట్ ఇవ్వాలని అనుకుంటోందట. ఆమె ఓకే అంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి బరిలో దించడమో లేదంటే పార్టీ తరపున ప్రచారం చేయించడమో చేయాలని భావిస్తోందట. నిజంగానే మీనా రాజకీయాల్లోకి రాబోతున్నారా? బీజేపీ ఆమెకు టికెట్ ఇస్తుందా? అసలు ఉప రాష్ట్రపతిని మీనా ఎందుకు కలిశారు? ఈ ఊహాగానాలకు చెక్ పడాలంటే మీనా స్పందించాల్సిందే.


Click it and Unblock the Notifications











