SVSC దర్శకుడితో నాగబాబు తనయుడి చిత్రం
హైదరాబాద్ : శ్రీకాంత్ అడ్డాల. నిన్నటి వరకు పెద్దగా పాపులారిటీ లేని ఈ పేరు నేడు ఫిల్మ్ నగర్లో మారు మ్రోగిపోతోంది. పెద్ద పెద్ద నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. దీనంతటికీ కారణం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం విజయం సాధించడమే. కేవలం ఒకే ఒక్క సినిమా(కొత్తబంగారులోకం) తీసిన అనుభవం మాత్రమే ఉన్న శ్రీకాంత్ అడ్డాల.....టాలీవుడ్ టాప్ స్టార్స్ మహేష్ బాబు, వెంకటేష్‌లతో కమర్షియల్ అంశాలు ఏమీ లేకుండా కుటుంబ కథా చిత్రం చేసి విజయం అందుకోవడం నిజంగా గొప్ప విషయమే.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం....శ్రీకాంత్ అడ్డాల తన తర్వాతి సినిమా నాగబాబు తనయుడు వరుణ్ తేజతో చేయబోతేన్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడనుంది. తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం అయితేనే బెటరని నాగబాబు బలంగా నమ్ముతున్నాడని, వరుణ్ తేజ కోసం మంచి కథ రెడీ చేయమని అతన్ని పురమాయించాడని టాక్. గీతా ఆర్ట్స్ బేనర్ పై ఈచిత్రం రూపొందే అవకాశం ఉంది.
ప్రస్తుతం వరుణ్ తేజ నటనతో పాటు, సినిమాకుల సంబంధించిన విషయాలపై శిక్షణ తీసుకుంటున్నాడు. వాస్తవానికి 2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు.
ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా...మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో తన తనయుడికి కూడా సెంటిమెంటు పని చేస్తుందని నాగాబాబు ఆశ పడుతున్నాడని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











