ఏజెంట్ మూవీకి బిజినెస్ కష్టాలు.. అఖిల్ అక్కినేనికి కఠిన పరీక్షే!
అక్కినేని నట వారసుడు అఖిల్ తన కెరీర్‌లో భారీ హిట్ కోసం ప్రయత్నిస్తూ చేస్తున్న చిత్రం ఏజెంట్. దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రం హై క్లాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నది. అయితే ఈ సినిమా షూటింగ్, రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడటం, కరోనా వైరస్ పరిస్థితుల కారణంగా ఏజెంట్ సినిమాపై బడ్జెట్ భారం విపరీతంగా పడినట్టు సమాచారం. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌పై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

రెండేళ్లుగా ఏజెంట్ షూటింగ్
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్2 సినిమా బ్యానర్లపై ఏజెంట్ తెరకెక్కుతున్నది. ఈ చిత్రం ఏప్రిల్ 2021లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ సినిమా రకరకాల కారణాల వల్ల అపసోపానాలు పడుతూ రెండేళ్లుగా షూటింగు జరుపుకొంటున్నది. అనేక కష్టాలను అధిగమించి ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకొన్నది.

యాక్షన్ థ్రిల్లర్‌తో అఖిల్
ఏజెంట్ సినిమా ప్రమోషన్స్‌ను ఇటీవల ప్రారంభించారు. ఈ సినిమాకు సంబంధించిన పాటను ఇటీవలే సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అయితే ఈ పాటకు అనుకొన్నంత మేర క్రేజ్ రాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీగానే ఆశలు పెంచుకొన్నారు.

80 కోట్లకు చేరుకొన్న బడ్జెట్
ఇక ఏజెంట్ సినిమా షూటింగ్ సుదీర్ఘంగా సాగడంతో బడ్జెట్ తడిసి మోపెడు అయినట్టు సమాచారం. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్ర బడ్జెట్ దాదాపు 80 కోట్లకు చేరుకొన్నట్టు తెలుస్తున్నది. అఖిల్ గత సినిమాల బాక్సాఫీస్ రికార్డు చూస్తే.. ఈ రేంజ్‌లో కలెక్షన్లు సాధించిన దాఖలాలు లేవు. అయితే ఈ క్రమంలో అఖిల్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో కష్టాలు ఎదురయ్యాయని, ఈ సినిమా బిజినెస్ అతి కష్టంగా జరిగిందనే విషయం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

60 కోట్లకు బేరం పెడితే..
అయితే ఏజెంట్ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను దాదాపు 60 కోట్లు కోట్ చేయడంతో బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు వెనుకంజ వేశారు. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక హక్కులను గాయత్రి ఫిలింస్ సుమారు 35 కోట్ల రూపాయాలకు తీసుకొన్నట్టు సమాచారం. బడ్జెట్ పరంగా ఈ బిజినెస్ తక్కువే అయినప్పటికీ.. అఖిల్ కెరీర్ విషయంలో చూస్తే.. అత్యధికమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అఖిల్‌కు ఏజెంట్ హిట్ అందిస్తుందా?
అఖిల్ సినిమాపై థియేట్రికల్ బిజినెస్ విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఒకవేళ ఏజెంట్ సినిమాకు మంచి టాక్, హైప్ వస్తే తప్పా.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా అఖిల్‌ను హిట్ జోన్‌లోకి చేర్చుతుందా? అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశవుతున్నది.


Click it and Unblock the Notifications











