‘అక్కినేని' వర్సెస్ ‘ఘట్టమనేని'..బాక్సాఫీస్ పోరు నుంచి వారసుడు వెనక్కి?

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జూలైలో 'అక్కినేని వర్సెస్ ఘట్టమనేని'వారసుల మధ్య ఆసక్తికర పోరు చూడొచ్చని సినీ అభిమానులు భావించారు. అఖిల్ నటించిన 'లెనిన్' జూలై 10న విడుదలకు సిద్ధమవుతుండగా, ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న 'శ్రీనివాస మంగాపురం' జూలై 9న రిలీజ్ అవుతుందని ప్రకటించడంతో రెండు కుటుంబాల వారసుల మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఖాయమనే చర్చ నడిచింది. అయితే ఇప్పుడు ఆ పోరు జరగదని తెలుస్తోంది.'అక్కినేని వర్సెస్ ఘట్టమనేని' బాక్సాఫీస్ ఫైట్‌కు తెరపడినట్టైంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీనివాస మంగాపురం అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Akhil s Lenin Avoids Box Office Clash Jayakrishna s Srinivasa Mangapuram Likely Postponed

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది. మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మొదట ఈ సినిమాను జూలై 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. పోస్టర్లు, టీజర్, పాటలతో ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది. అయితే గత కొన్ని రోజులుగా సినిమా ప్రమోషన్స్ ఒక్కసారిగా నెమ్మదించడంతో పాటు ట్రైలర్, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లపై ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో విడుదల తేదీపై సందేహాలు మొదలయ్యాయి.

ఇప్పుడు ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ఈ సినిమాను జూలై 30కు మార్చే యోచనలో మేకర్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే.. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణంగా బాక్సాఫీస్ పోటీని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. జూలై నెలలో వరుసగా భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. జూలై 3న ఇప్పటికే మంచి బజ్ సంపాదించుకున్న 'రావు బహదూర్', 'నాగబంధం' వంటి చిత్రాలు విడుదల కానున్నాయి.

ముఖ్యంగా జూలై 10న అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్'భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాంటి సమయంలో కొత్త హీరో సినిమా విడుదలైతే థియేటర్లు, ఓపెనింగ్స్, మీడియా దృష్టి వంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మేకర్స్ భావించినట్లు సమాచారం. ముఖ్యంగా కొత్త హీరో సినిమాకు తొలి రోజు కలెక్షన్లతో పాటు పాజిటివ్ మౌత్ టాక్ వచ్చే వరకు మంచి సంఖ్యలో థియేటర్లు అవసరం. అదే సమయంలో స్టార్ హీరో సినిమా విడుదలైతే ఎగ్జిబిటర్లు సహజంగానే పెద్ద చిత్రానికే ఎక్కువ స్క్రీన్లు కేటాయిస్తారు.

దీంతో జయకృష్ణ లాంటి కొత్త హీరో తొలి సినిమాకు ఆశించిన స్థాయిలో స్క్రీన్ కౌంట్ లభించకపోవచ్చనే ఆందోళన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే అక్కినేని వారసుడితో నేరుగా పోటీ పడటం కంటే, కొంత గ్యాప్ ఇచ్చి విడుదల చేయడం ఉత్తమమని నిర్మాతలు నిర్ణయించినట్లు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరో కీలక అంశం ప్రమోషన్స్. సాధారణంగా కొత్త హీరో సినిమా విజయానికి ప్రచారమే ప్రధాన బలం. ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు మద్దతు లభిస్తే సినిమాపై మరింత బజ్ ఏర్పడుతుందని అభిమానులు భావించారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు మహేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారనే ప్రచారం కూడా జరిగింది.

ఇదిలా ఉంటే.. జూలై 30 తేదీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. 1999 జూలై 30 న మహేష్ బాబు హీరోగా నటించిన తొలి సినిమా 'రాజకుమారుడు'విడుదలై ఘనవిజయం సాధించింది. అదే తేదీన ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు జయకృష్ణ తొలి సినిమా విడుదలయ్యే అవకాశం ఉండటంతో అభిమానులు దీనిని సెంటిమెంట్‌గా కూడా చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇవన్నీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మాత్రమే.'శ్రీనివాస మంగాపురం' విడుదల తేదీ మార్పుపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more about: akhil akkineni lenin gattamaneni
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X